క్లారిటీ ఇచ్చిన విజయ్ దేవరకొండ

నకిలీ కాస్టింగ్ కాల్ పేరిట అమ్మాయిల్ని ఆకర్షించడం వాళ్లను లోబరుచుకోవడం లాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. అంతెందుకు.. మొన్నటికిమొన్న దర్శకుడు అజయ్ భూపతి పేరిట ఇలాంటి కాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఏకంగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఇలాంటి ప్రకనట వచ్చింది. ఇవన్నీ నకిలీ ప్రకటనలే. ఆ వ్యక్తులతో, సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడీ ఉచ్చులోకి విజయ్ దేవరకొండను కూడా లాగారు కేటుగాళ్లు.

విజయ్ దేవరకొండ పేరిట కాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చింది. విజయ్ దేవరకొండ సరనస ఛాన్స్ అంటూ ఊరించింది. అంతేకాదు.. విజయ్ దేవరకొండ నిర్మాతగా తీయబోతున్న సినిమాలో కూడా అవకాశం అంటూ ప్రకటించుకుంది. దీనిపై వెంటనే సదరు హీరో యూనిట్ రియాక్ట్ అయింది.

ఆ కాస్టింగ్ కాల్ కు విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని అతడి యూనిట్ స్పష్టంచేసింది. ఇలాంటి విషయాలేమైనా ఉంటే విజయ్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటనలు ఇస్తామంటూ తెలిపింది. నకిలీ ప్రకటనలు ఇచ్చిన వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది.