ఒకే ఒక్కడు…. ముప్పయ్యేళ్లు… మూడు కిలోమీటర్ల కాలువ !

బీహార్లో ఓ వ్యక్తి ముప్పయ్యేళ్ల పాటు శ్రమించి మూడు కిలోమీటర్ల కాలువని తవ్వాడు. కొండలపై నుండి కురుస్తున్న వాననీరు… తమ గ్రామానికి వచ్చేందుకు వీలుగా అతను ఈ పనిచేశాడు. బీహార్, గయా జిల్లాలోని లాతువా అనేప్రాంతంలో కొథిలావా అనే గ్రామం అతనిది. తనపేరు లాంగీ భుయాన్.

ముప్పయ్యేళ్లుగా  తన పశువుల మందని మేపేందుకు అడవికి వెళ్లి కాలువ తవ్వుతున్నట్టుగా భుయాన్ తెలిపాడు. కొండలపైనుండి పడుతున్న వాననీటిని ఈ కాలువ ద్వారా  … తమ ఊళ్లోని చెరువులోకి తేవాలనేది అతని లక్ష్యం. అవిశ్రాంతంగా శ్రమించి భుయాన్ దానిని సాధించాడు.  ఈ విషయంలో తనకు ఎవరూ తోడు రాలేదని, గ్రామంలోని వారంతా ఉపాధి కోసం నగరాలకు వలస పోతున్నారని, తాను మాత్రం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నానని భుయాన్ అన్నాడు.

కొథిలావా గ్రామం చుట్టు దట్టమైన అడవులు ఉంటాయి. ఇది గయ జిల్లా కేంద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మావోయిస్టులు ఆశ్రయం పొందుతుంటారనే పేరుంది.

గయ జిల్లాలో ప్రజలు ప్రధానంగా వ్యవసాయం, పశువుల పెంపకాలపైన ఆధారపడి జీవిస్తుంటారు.

భుయాన్… తన గ్రామంలోని ప్రజలందరికీ ఉపయోగపడే పని చేశాడని ఇప్పుడు అందరూ తన గురించి తెలుసుకుంటున్నారని గయలో నివసించే రామ్ విలాస్ సింగ్ అనే టీచరు అంటున్నాడు. ఇంతకుముందు బీహార్ కు చెందిన దశరథ్ మాంజీ అనే వ్యక్తి… 22 ఏళ్ల పాటు కష్టపడి కొండలను తొలచి నడిచేదారిని ఏర్పరచాడు. తను ప్రాణంగా ప్రేమించిన భార్య కొండలపై నుండి పడి మరణించడంతో దశరథ్ మాంజీ తీవ్రమైన బాధకు గురయి…  అంతటి జటిలమైన పనిని ఒంటి చేత్తో సాధించాడు. ఇప్పుడు భుయాన్ సైతం  సాటి మనుషులకోసం దశాబ్దాల పాటు శ్రమించాడు. సామాన్యులను అసామాన్యులుగా మార్చే సంకల్పబలం వీరిది.