కౌన్‌ బనేగా కరోడ్‌పతి ఇలా అయిపోయాడు…

2011లో కౌన్‌ బనేగా కరోడ్‌పతి విన్నర్‌ సుశీల్‌ కుమార్‌కు కోట్లతో పాటు కష్టాలు, చెడు అలవాట్లు కూడా వచ్చేశాయి. బీహార్‌కు చెందిన సుశీల్‌.. 2011లో అమితాబచ్చన్‌ షోలో 5 కోట్లు గెలిచేశాడు. ట్యాక్స్‌లు పోను 3.50 కోట్లు రూపాయల చెక్‌తో షో నుంచి బయటకు అడుగు పెట్టాడు. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుశీల్‌ పేరు మార్మోగిపోయింది.

2011లోనే మూడున్నర కోట్లు అందుకోవడంతో చాలా మంది అతడి వద్ద సాయం కోసం క్యూ కట్టారు. ఆ తర్వాత సుశీల్ గురించి పెద్దగా చర్చ లేదు. కానీ ఒక్కసారిగా కోటిశ్వరుడు అయిన తర్వాత తన జీవితం ఎలా పతనం అయిందో స్వయంగా వివరిస్తూ సుశీల్‌ కుమార్ ఇటీవల సోషల్ మీడియాలో సుధీర్ఘంగా ఒక పోస్టు రాశారు.

కేబీసీలో గెలిచిన తర్వాత తన జీవితం దారుణంగా తయారైందంటూ తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. ఇంత డబ్బు వచ్చిన తర్వాత తాను మద్యానికి, సిగరెట్లకు బానిసైపోయినట్టు వివరించారు. కొందరు తనను ఆర్థికంగా మోసం చేశారని కూడా వెల్లడించారు. 2015 నుంచి 2016 మధ్య తన జీవితం అత్యంత కఠినంగా మారిపోయిందని తన పోస్టులో రాశారు.

కేబీసీలో గెలిచిన తర్వాత చాలా మంది అతడిని వివిధ కార్యక్రమాలకు పిలిచారట. నెలలో 15 రోజులు ఫంక్షన్లకే సరిపోయేది. వివిధ కారణాలు చెప్పి చాలా మంది ఆర్థిక సాయం పొందారని.. నెలకు 50వేల వరకు దానాలకే ఖర్చయ్యేదని చెప్పారు. మద్యం తాగడం, సిగరెట్లు కాల్చడం, గంటల తరబడి ల్యాప్‌టాప్‌లో సినిమాలు చూస్తూ గడిపేయడం వంటివి చేసేవాడినని…. సుశీల్‌ దారి తప్పడంతో అతడి వైఖరి నచ్చక భార్య కూడా దూరమైందని చెప్పుకొచ్చాడు.

సినిమాలు ఎక్కువగా చూసి వాటి ప్రభావానికి లోనై ఏకంగా దర్శకుడు కావాలని ముంబై వెళ్లాడు. కొన్ని కథలు రాశాడు. కొందరు సినిమాల్లో కాదు గానీ ముందు వెళ్లి టీవీ కార్యక్రమాలకు పనిచేయ్ అంటూ సలహాలు ఇచ్చారు. కానీ ఎక్కడా పట్టుదొరకలేదు. సినిమాలకు కథలు రాసేందుకు గదిలో కూర్చుంటే సిగరెట్ పొగతో గది మొత్తం నిండిపోయేదని వివరించాడు.

చివరకు తాను దారి తప్పానని తెలుసుకుని, తాను జీవితం నుంచి పారిపోతున్నానని గుర్తించానని.. ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండడం కంటే మంచి మనిషిగా ఉండడమే ఎంతో గొప్పదని తెలుసుకున్నానని సుశీల్ తన పోస్టులో వివరించాడు. అహాన్ని సంతృప్తి పరచడం సాధ్యం కాదని గ్రహించి తిరిగి తన హోంటౌన్‌కు వచ్చి టీచర్‌ జీవితాన్ని మళ్లీ ప్రారంభించానని సుశీల్ కుమార్ వివరించాడు. 2016 నుంచి మద్యం, సిగరెట్ లాంటి వ్యసనాలను కూడా పక్కనపెట్టేసినట్టు వెల్లడించాడు.