రఘురామకృష్ణంరాజుకు ఆ చాన్స్‌ ఇవ్వం – మిథున్ రెడ్డి

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో … ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్షరెన్స్‌ నిర్వహించారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ భేటీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అవకాశం దక్కలేదు.

ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి ఒక అధికారి ఫోన్‌ చేసి సీఎంతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారని రఘురామకృష్ణంరాజు వివరించారు. తాను సిద్ధమవుతుండగానే తిరిగి 11 గంటలకు అదే అధికారి ఫోన్ చేసి వీడియో కాన్ఫరెన్స్‌ కు రావొద్దని చెప్పారని రఘురామకృష్ణంరాజు మీడియా ముందు వెల్లడించారు.

తనను సమావేశానికి రావొద్దు అని చెప్పారు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరించినట్టుగానే తానుభావిస్తున్నానని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

అటు వైసీపీ వ్యూహం మాత్రం వేరేలా ఉంది. రఘురామకృష్ణంరాజుకు పూర్తిగౌరవం ఇచ్చామని… కానీ ఆయన ఎలా వ్యవహరిస్తున్నారో అందరూ చూస్తున్నారని వైసీపీ లోక్‌సభపక్ష నేత మిథున్ రెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజుని తామేమీ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోమని… అనర్హత వేటు వేయాలన్న ప్రతిపాదనకే కట్టుబడి ఉన్నామని మిథున్ రెడ్డి వివరించారు.