ప‌బ్‌జీ… ఓ ప‌ద్మ‌వ్యూహం

  • మీ పిల్ల‌ల్ని అభిమ‌న్యుల్లా వ‌దిలేయొద్దు
  • ప్ర‌ముఖ సైక్రియాటిస్ట్ డాక్ట‌ర్ ఎన్ఎన్ రాజు
డాక్ట‌ర్ ఎన్‌. ఎన్‌. రాజు, సైక్రియాటిస్ట్‌, విశాఖ‌ప‌ట్నం

ప‌ద్మ‌వ్యూహంలోకి వెళ్ల‌డ‌మే తెలిసిన అభిమ‌న్యుడు క‌థ ఏమైందో మ‌న‌కు తెలుసు క‌దా! ప‌బ్‌జీలోకి వెళ్లే పిల్ల‌లూ అభిమ‌న్యుడిలాంటివారే! ప‌బ్‌జీ ఆడ‌టం ఆరంభించ‌డం వ‌ర‌కే వీరి ప‌ని. అందులోంచి బ‌య‌ట‌కు రావ‌డం ప‌ద్మ‌వ్యూహం నుంచి బ‌య‌ట‌కొచ్చిన‌ట్టే. ఇప్పుడు ప‌బ్‌జీయే లేదు అయినా ప‌బ్‌జీ ఆడేవాళ్లంతా ఆ వ్యూహంలో వున్న‌ట్టే.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌ల‌భై కోట్ల మంది ప‌బ్‌జీ ఆడుతుంటే, భార‌త‌దేశంలో 12 కోట్ల మంది యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారంటే ఏ స్థాయిలో ఎడిక్ట్ అయ్యారో అర్థం చేసుకోవ‌చ్చు. విద్యార్థుల‌కు ప‌బ్‌జీ ఒక వ్య‌‌స‌నంగా మారింది. ఇది చ‌దువుల‌పైనా, మానసిక వికాసంపైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. మానసిక స‌మ‌స్య‌లు తీవ్రం అవుతున్న నేప‌థ్యంలో మ‌న‌దేశంలో ప‌బ్‌జీ నిషేధించాలని ఉద్య‌మాలు, కోర్టుల్లో కేసులు దాఖ‌ల‌య్యాయి.

ఇదే స‌మ‌యంలో చైనా యుద్ధానికి కాలు దువ్వుతున్న నేప‌థ్యం తోడైంది. కేంద్రం ప‌బ్‌జీతోపాటు 118 యాప్‌ల‌ను నిషేధించింది. అయితే ఒక్క‌సారిగా ప‌బ్‌జీ ఆడ‌క‌పోవ‌డం వ‌ల్ల కూడా మాన‌సిక స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలున్నాయ‌ని వైద్య‌నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇటీవ‌లే పబ్జీ గేమ్‌కు బానిసైన అనంత‌పురానికి చెందిన‌ బీటెక్ విద్యార్థి కిరణ్ కుమార్ రెడ్డి ..ఆట బ్యాన్ కావ‌డంతో మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు లోనై ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఓ వైపు, ఎటువంటి కౌన్సెలింగ్ లేక సంఘ‌ర్ష‌ణ‌తో ఒత్తిడి గుర‌వుతూ విద్యార్థులు, యువ‌త భ‌విష్య‌త్ అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌వుతోంది.

ప‌బ్‌జీ బ్యాన్ అనంత‌రం ఈ ఆట‌కు బానిసైన వారిలో త‌లెత్తే ఇబ్బందుల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ముఖ మాన‌సిక వైద్యులు డాక్ట‌ర్ ఎన్ఎన్ రాజు కొన్ని సూచ‌న‌లు చేశారు. అదేప‌నిగా ప‌బ్‌జీ ఆడే వారికి ఒక్క‌సారిగా అందుబాటులో ఆట లేక‌పోవ‌డం వ‌ల్ల వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు రావొచ్చు. దీనివ‌ల్ల వారికి చేసే ప‌ని ప‌ట్ల‌ ధ్యాస లేక‌పోవ‌డం, బాధ్య‌త‌లు విస్మ‌రించ‌డం, సామాజిక జీవితం దెబ్బ‌తిన‌టం జ‌రుగుతుంది. చ‌దువులో వెన‌క‌ప‌డ‌టం, ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా లేక‌పోవ‌డం, నిర్దేశిత ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోతారు.

దీని నుంచి వారిని నెమ్మ‌దిగా మ‌ర‌ల్చేందుకు ప్ర‌య‌త్నించాలి. ముఖ్యంగా పిల్ల‌ల్లో ఆ ర‌క‌మైన ప్ర‌వ‌ర్త‌న‌ను పోగొట్టేందుకు నిపుణులైన మాన‌సిక వైద్యుల‌ను సంప్ర‌దించి, వారి సూచ‌న‌లు స‌ల‌హాలు స్వీక‌రించి దానిక‌నుగుణంగా ప్ర‌వ‌ర్తించాలి.

ప‌బ్‌జీ దూరం అవ‌డంతో త‌లెత్తే ఇబ్బందులు దూరం చేయ‌డానికి ప‌నికొచ్చే కొన్ని “ప్రవర్తనా పరివర్తన” సూచ‌న‌లు

1. ఆట ఆడ‌టం వ‌ల్ల వ‌చ్చే దుష్ఫ‌లితాలను అతిగా వివరించి భ‌య‌పెట్టాల‌ని చూడొద్దు
2. తీవ్రంగా స్పందించొద్దు
3.దైనందిన కార్య‌క‌లాపాలు ఒక ప్ర‌ణాళిక వేసుకుని చేసేలా చూడండి
4.పిల్ల‌లు దినచర్యను పాటిస్తే, ప్రతీ చర్యను ‘టిక్’ లేదా ‘స్టార్’ ద్వారా గుర్తించి వాటిని నియమిత బ‌హుమ‌తిగా ఇచ్చి చూడండి
5. పిల్ల‌ల్లో కోపం పెంచే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా నిగ్ర‌హం పాటించండి
6. పూర్తిగా నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా, అలాగ‌ని అదే ప‌నిగా నిఘా పెట్టిన‌ట్టు కాకుండా చూసీచూడ‌న‌ట్టు ప‌రిశీలిస్తుండండి.
7. అవసరమైన ప్రవర్తనకు ఆనందం జోడించే విధంగా బ‌హుమ‌తులిచ్చి ప్రోత్స‌హించండి. ముందుగా చేసే ప్రకటనలు, ఇచ్చే బహుమతులు నిష్ప్రయోజనం.
8.ఏ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కావాల‌న్నా ప్రోత్సాహ‌కాలు, బ‌హుమతుల‌తో ఆక‌ట్టుకోవాలనేది ముఖ్య‌మైన‌ది
9.ఇత‌రుల‌తో పోలిక‌లు తేవొద్దు. భారీ ఉప‌న్యాసాలు ఇవ్వొద్దు.
10. మ‌త్తు ప‌దార్థాల వంటి వ్యస‌నాలులా కాకుండా ఈ ఆటలను మాన‌సిక ఘర్షణగా గుర్తించండి. సంఘర్షణే మార్పుకు మార్గం. మ‌న‌స్సుల్ని గెల‌వండి..మాన‌సిక స‌మ‌స్య‌పై విజ‌యం సాధించండి.

-డాక్ట‌ర్ ఎన్‌. ఎన్‌. రాజు, సైక్రియాటిస్ట్‌, విశాఖ‌ప‌ట్నం