అక్టోబరులో సినిమా హాల్స్ తెరుచుకుంటాయా?

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. అక్టోబరు ఒకటి నుండి… కోవిడ్ 19 నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాహాళ్లు ప్రారంభం కానున్నాయని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసిందనీ… ఆ వార్త సారాంశం.

అయితే ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ ట్విట్టర్ ఖాతా… ప్రభుత్వం ఇంతవరకు అలాంటి నిర్ణయం  ఏదీ తీసుకోలేదని ప్రకటించింది. ప్రభుత్వ పథకాలు, విధానాలకు సంబంధించి ఏదైనా తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉన్న సందర్భాల్లో పిఐబి ఫ్యాక్ట్ చెక్ కలగజేసుకుని… దానికి సంబంధించిన నిజమేంటో తెలుసుకుని ప్రజలకు అందిస్తుంది. సినిమా హాల్స్ తెరిచే అంశంపైన కూడా అది స్పందించింది.

అయితే అక్టోబరులో హాల్స్ తెరుచుకుంటాయనే వార్త రావటం వెనుక ఒక కారణం ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశ నిర్మాతలు అందరూ  … అక్టోబరులో  దసరా పండుగనాటికయినా సినిమా హాళ్లను తెరుచుకునే అవకాశం కల్పించమని ప్రభుత్వాన్ని కోరారు. దాంతో ఇక అక్టోబరులో  వెండితెర వెలుగుతుందనే వార్తలు బయటకు వచ్చాయి.  కరోనా కారణంగా మార్చి నెల నుండి సినిమా హాల్స్ అన్నీ మూసేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ అంశంపై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం… ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనప్పటికీ ఆరోగ్య మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతూ దీనిపై విధివిధానాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది.