ఏపీ హైకోర్టు తీర్పుపై ప్రశాంత్‌ భూషణ్‌ సంచలన ట్వీట్

అమరావతి భూకుంభకోణం కేసులో 12 మంది పై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు స్టే ఇచ్చింది. మీడియాలో గానీ, సోషల్ మీడియాలో గానీ ఈ కేసు వివరాలు ప్రచురించడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు ఇచ్చింది.

దీనిపై సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. మీడియాను, సోషల్ మీడియాను నియంత్రిస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతికి గురిచేసిందని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

మాజీ అడ్వకేట్‌ జనరల్‌తో పాటు కొందరు ముఖ్యమైన వ్యక్తులకు వ్యతిరేకంగా దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లోని నిజాలను ప్రచురించకుండా మీడియాపై, సోషల్ మీడియాపై ఆంక్షలను ఆయన తప్పుపట్టారు. ఎఫ్‌ఐఆర్‌ను రహస్యంగా ఉంచాలా అని నిలదీశారు. మాజీ అడ్వకేట్ జనరల్‌పై కేసును రిపోర్టు చేయకూడదా అని నిలదీశారు. హైకోర్టు ఆదేశాలు ఆర్టికల్ 19కి, సమాచార హక్కులకు విరుద్ధమని ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు.

హైకోర్టు ఆదేశాలు ఆశ్చర్యానికి గురి చేశాయని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్‌దేశాయ్‌ ట్వీట్ చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో సామాన్యుడి పేరుంటే ఎంతటి దుస్థితికైనా సిద్ధంకావాలా.. ఎఫ్‌ఐఆర్‌లో పెద్ద వాళ్ల పేరుంటే మాత్రం తక్షణం రహస్యంగా ఉంచాలని ఆదేశాలా అని ప్రశ్నించారు.