సుప్రీంకోర్టుకు వెళ్తాం… జడ్జి కుమార్తెలు తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? – సజ్జల రామకృష్ణారెడ్డి

హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్న జరిగిన పరిణామం చూస్తుంటే దేశంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన శక్తులన్నీ ఏకం అయినట్టు అనిపిస్తోందన్నారు. పెద్దలైతే ఒక న్యాయం ఉంటుంది, సామాన్యులకు ఒకలా న్యాయం ఉంటుందని భావించేలా తీర్పు ఉందని తాము భావిస్తున్నట్టు వివరించారు.

అమరావతి కుంభకోణంపై సిట్‌ ఏర్పాటును కూడా హైకోర్టు కొట్టివేయడం పైనా సజ్జల అసంతృప్తి వ్యక్తం చేశారు. సిట్‌ దర్యాప్తుపై హైకోర్టులో నేడు వచ్చే తీర్పు గురించి టీడీపీ నేత బోండా ఉమా నిన్న సాయంత్రమే మీడియా సమావేశంలో మాట్లాడారని… కోర్టుల్లో ఏ కేసు ఎప్పుడు వస్తుందో టీడీపీ నేతలకు ముందే ఎలా తెలుస్తోందని ప్రశ్నించారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కుమార్తెలు ఒకవేళ తప్పు చేసి ఉంటే … దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదా అని సజ్జల వ్యాఖ్యానించారు. తీసుకున్న చర్యలను ప్రాథమిక దశలోనే నొక్కేస్తే ఇక న్యాయం ఎలా జరుగుతుందన్నారు.

ఇప్పుడు ఇచ్చిన తీర్పులనే పరిగణలోకి తీసుకుంటే ఎవరూ నోరెత్తడానికి ఉండదన్నారు. ప్రజల, ప్రభుత్వ, మీడియా, దర్యాప్తు సంస్థల గొంతు నొక్కడమే అవుతుందన్నారు.