ఈఎస్ఐ చందాదారులకు నిరుద్యోగ భృతి

కరోనా లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఫ్యాక్టరీలు మూతపడటం, ప్రైవేటు సంస్థలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడంతో వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. కాగా, ఈఎస్ఐ చందాదారులుగా ఉంటూ ఉద్యోగాలు కోల్పోయిన వారికి నిరుద్యోగ భృతి అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటల్ బీమిత్ కల్యాణ్ యోజన కింద జీతంలో 50 శాతం సొమ్మును నిరుద్యోగ భృతిగా ఇవ్వనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ గురువారం తెలిపింది.

ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ చందాదారులు సమీపంలోని కార్యాలయంలో సంప్రదిస్తే మరిన్ని వివరాలు తెలియజేస్తారు. నిరుద్యోగులు స్వయంగా లేదా ఆన్‌లైన్ ద్వారా దీనికి సంబంధించిన దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ప్రతీ దరఖాస్తుతో ఆధార్ జిరాక్సు, బ్యాంకు వివరాలు, అఫిడవిట్ సమర్పించాలి.

అర్హులైన వారికి ఈ ఏడాది జులై నుంచి వచ్చే ఏడాది జూన్ వరకు జీతంలో 50 శాతాన్ని నిరుద్యోగ భృతి కింద అందిస్తారు. గతంలోనూ ఈ పథకం ద్వారా 25 శాతం భృతి కింద అందించే వారు. కానీ ఇప్పుడు దానిని 50 శాతానికి పెంచారు.

ఈ నిరుద్యోగ భృతి పొందాలనుకునే వ్యక్తులు యాజమాన్యంతో సంబంధం లేకుండా స్వయంగా దరఖాస్తులు పంపవచ్చు. సొమ్ము కూడా కార్మికులు, ఉద్యోగుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని కేంద్ర కార్మిక శాఖ తెలిపింది.