అమరావతిపైనా సీబీఐ విచారణ జరగాల్సిందే – జీవీఎల్

అంతర్వేది రథం కేసు, అమరావతి కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్టు వెల్లడించారు. అంతర్వేది రథం కేసుపైనా సీబీఐ విచారణకు కోరామన్నారు.

టీడీపీ హయాంలో అనేక గుళ్లను కూల్చివేశారన్నారు. పుష్కరాల సమయంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అప్పుడు అవన్నీ చేసి ఇప్పుడు మాత్రం చంద్రబాబునాయుడు… హిందూ ఉద్దారకుడిగా మాట్లాడుతున్నారని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబు హిందుత్వం అంటూ ఇప్పుడు కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబసభ్యులు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేయించిన ఉదంతం కూడా మరిచిపోకూడదన్నారు.

రాష్ట్రంలో ఆలయాలపై జరగుతున్న దాడులను, బీజేపీ కార్యకర్తల అరెస్ట్‌ల అంశాన్ని కూడా హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ కూడా యాంటీ హిందూపార్టీలే అని ఆరోపించారు.