ఆ సమయంలో సుశాంత్… అలా రాశాడు !

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 2018లో రాసిన కొన్ని రాతల తాలూకూ పేజీలు బయటకు వచ్చాయి. సుశాంత్ కి చెందిన పవన ఫామ్ హౌస్ నుండి ఓ మీడియా సంస్థ సేకరించిన… సుశాంత్ రాతల్లో ఆనేక ఆసక్తికరమైన విషయాలున్నాయి. అవన్నీ అప్పటి అతని ఆలోచనలకు, అతని వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి.

ఏప్రిల్ 27, 2018న అతను తన దినచర్యని నోట్ చేశాడు. పేపరుపైన కొన్ని అంశాలను రాసుకుని… తాను ఆచరించినవాటికి టిక్ చేసుకున్నాడు. అందులో ఉన్న వివరాలను బట్టి సుశాంత్ ఆ రోజు ఉదయం రెండున్నరకు నిద్రలేచి సూపర్ మేన్ టీ తాగాడు, చన్నీళ్ల స్నానం చేశాడు. కొన్ని వేద శ్లోకాలను సైతం చదివాడు. ‘సిగరెట్ తాగలేదు…’ అనే అంశంపైన టిక్ చేశాడు. తరువాత రోజు కేదార్ నాథ్ స్క్రిప్టు చదవాల్సి ఉందని పేర్కొన్నాడు. 2018లో అతను సిగరెట్టు మానేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఈ రాతలను బట్టి తెలుస్తోంది. కృతితో కొంత సమయం గడపాలి… అని కూడా అందులో ఉంది. అప్పట్లో నటి కృతి సనన్ తో సుశాంత్ రిలేషన్ లో ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. తన సోదరి ప్రియాంక, ఆమె భర్త మహేష్ తో కలిసి టూర్ వెళ్లాలని కూడా రాశాడు. ఈ రాతల్లో రియా ప్రస్తావన లేదు. ఆమె అతని జీవితంలోకి 2019లో వచ్చింది.

ఇంకా… ఒక క్రమమైన అర్థం కనిపించని… తనలోని లోతైన ఆలోచనలను ప్రతిబింబించే రాతలు సైతం కొన్ని పేపర్లలో కనిపించాయి. ‘సరైన సమాధానాలు అంటూ ఉండవు… మంచి ప్రశ్నలు మాత్రమే ఉంటాయి’, ‘సమస్యని ఎలా పరిష్కరించాలి’,  ‘ఆనందం ఎందుకు’,  ‘అనుభవం, విశ్లేషణ, ఆనందం, ధైర్యం, తెలివితేటలు, దైవం’…. ఇలాంటివి ఉన్నాయి. ‘చిన్న పనుల్లో విజయం సాధించినవారే భవిష్యత్తుని చక్కగా మలచుకుంటారని..’  హిందీలో రాసుకున్నాడు.

కొన్ని కొటేషన్లను సైతం సుశాంత్ రాసుకున్నాడు. అందులో కబీర్ దాస్ కొటేషన్ ‘నేను అక్కడ ఉన్నపుడు అక్కడ దేవుడు లేడు… ఇప్పుడు దేవుడు ఉన్నాడు నేను లేను’ అనేది కూడా ఉంది. అతను రాసుకున్న మరొక కొటేషన్ ‘మీరు కోరుకునేదే మిమ్మల్ని వెతుకుతోంది’. శివుని మూడోకన్ను, కైలాష్, సోమరాస్, తపస్య, యోగా… నీతి అయోగ్ మొదలైన అంశాలను అతను తన రాతల్లో ప్రస్తావించాడు.