విజయ్ ను మరోసారి వాడేశారుగా!

నకిలీగాళ్లు విజయ్ దేవరకొండను మరోసారి వాడేశారు. ఇప్పటికే ఇతడి పేరుపై ఫేక్ కాస్టింగ్ కాల్ ప్రకటన ఒకటి వచ్చింది. దీనిపై దేవరకొండ టీమ్ సీరియస్ గా రియాక్ట్ అయింది. ఈసారి విజయ్ దేవరకొండ పేరు చెప్పి ఏకంగా హీరోయిన్లనే బుక్ చేయాలనుకున్నారు కొంతమంది. అందరూ చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద స్కామ్ తప్పింది.

విజయ్ దేవరకొండ తమకు కాల్షీట్లు ఇచ్చాడంటూ ప్రకటించుకుంది కోలీవుడ్ కు చెందిన డస్కీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే సంస్థ. అక్కడితో ఆగితే బాగుండు. ఏకంగా హీరోయిన్లను సంప్రదించడం మొదలుపెట్టారు. విజయ్ దేవరకొండ సరసన ఆఫర్ ఇస్తామంటూ పలువురు హీరోయిన్లను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అలా హీరోయిన్ల కాల్షీట్లు దక్కించుకునే ప్రయత్నం చేశారు.

అయితే ఈ విషయం మెల్లగా వెలుగులోకి వచ్చి, అటుఇటుగా విజయ్ దేవరకొండ టీమ్ కు చేరింది. డస్కీ ఎంటర్ టైన్ మెంట్స్ కు తమ హీరో కాల్షీట్లు ఇవ్వలేదంటూ టీమ్ ప్రకటించింది. అంతేకాదు.. ఆ సంస్థపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వబోతోంది. అయితే విషయం తెలుసుకున్న సంస్థ వెంటనే రియాక్ట్ అయింది. విజయ్ దేవరకొండకు భేషరతుగా క్షమాపణలు చెప్పింది.