డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు నటులు

సంచలనం సృష్టించిన శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు నటుల్ని బుక్ చేశారు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. దీంతో కన్నడ చిత్రసీమ మరోసారి ఉలిక్కిపడింది. ఈసారి నటుడు, యాంకర్ అకుల్ బాలాజీ, మరో నటుడు సంతోష్ కుమార్ కు నోటీసులిచ్చారు పోలీసులు. విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించారు.

నోటీసులు అందుకున్న సంతోష్ కుమార్, ఈరోజు సీసీబీ ముందు హాజరయ్యాడు. తొలి రోజు విచారణ కూడా పూర్తిచేసుకున్నాడు. కానీ అకుల్ బాలాజీ మాత్రం మొండికేశాడు. తను హైదరాబాద్ లో ఉన్నానని, రావడం కుదరదని సమాచారం పంపించాడు. దీంతో సీసీబీ ఆగ్రహం వ్యక్తంచేసింది. అన్ని పనులు ఆపేసి, విమానం ఎక్కి ఆదివారం నాటికి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

మరోవైపు ఈ కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కబెడుతున్నారు హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేది. వాళ్లు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లు ఎప్పటికప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. కనీసం ఈరోజైనా బెయిల్ వస్తుందని ఆశించిన ఈ హీరోయిన్లకు చుక్కెదురైంది.

కౌంటర్ దాఖలు చేసేందుకు మరో 2 రోజులు గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో.. బెయిల్ పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదావేశారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ బెంగళూరులోని పారాపన అగ్రహార జైలులో ఉన్నారు.