తల్లికి తలకొరివి పెట్టని నీవా మాట్లాడేది చంద్రబాబు! – కొడాలి నాని

వ్యవస్థలను కొందరు కంట్రోల్‌లో పెట్టుకుని వారికి నచ్చినట్టు పని చేయాలని చూస్తున్నారని.. మిగిలిన వ్యవస్థలు మాట్లాడకూడదు, చూడకూడదు, చూసినా మాట్లాడకూడదు, ఒకవేళ తమ మాట వినకపోతే ఈ దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను ఏమైనా చేయగలం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. ఇలాంటి సమయంలో ప్రతిఒక్కరూ ధైర్యంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.

మొన్నటి వరకు అమరావతి కుంభకోణంపై దర్యాప్తు చేయించండి… కడిగిన ముత్యంలా వస్తామని కోతలు కోసిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు మాత్రం దర్యాప్తును అడ్డుకుంటున్నారని విమర్శించారు. తాము దొంగలమని ముందే ఆ ఏడుపు ఏదో ఏడిసి ఉండాల్సిందన్నారు. అలా కాకుండా సవాళ్లు చేసి ఆ తర్వాత కోర్టుకు వెళ్లి దర్యాప్తులు ఆపడం ఎందుకని ప్రశ్నించారు.

మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌, ఏసీబీ దర్యాప్తులను హైకోర్టు ద్వారా అడ్డుకున్న చంద్రబాబు… కేంద్రంలో తాను బీజేపీలోకి పంపించిన నలుగురు ఎంపీల సాయంతో సీబీఐ విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. అవతలి వైపు కొండలు నిలబడ్డా సరే ఢీకొట్టేందుకు సిద్ధమైన అసలైన మగాడు జగన్‌మోహన్ రెడ్డి అని… అలాంటి వ్యక్తి తో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. అవతలి వారు ఎంతటి వారైనా సరే దేవుడిని నమ్ముకుని న్యాయం వైపు పోరాటానికి దిగిన వ్యక్తి జగన్‌మోహన్ రెడ్డి అని ప్రశంసించారు.

ఉడత ఊపులకు తాము భయపడబోమని… ఏపీలో న్యాయవ్యవస్థ, మీడియా తీరు సరిగా లేదన్నారు. జగన్‌పై ధ్వేషంతో కొందరు రగిలిపోతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా లేకపోవడంతో బ్రోకర్ పనులకు వీలుపడడం లేదని, దోచుకునేందుకు అవకాశం లేదని కొన్ని పత్రికలు నిత్యం గలీజు వార్తలు రాస్తున్నాయన్నారు.

ఆరు నెలల్లో మోడీ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై 10రూపాయలు పెంచిందని… మరి ఆ వార్తను రామోజీరావు ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. ఇదే పత్రిక చంద్రబాబు అమరావతి కోసం పెట్రోల్‌పై రెండు రూపాయలు అదనంగా పెంచితే ఇంకా మరో రెండు రూపాయలు పెంచాలని ప్రజలు కోరుతున్నారని సొల్లుకబుర్లు రాసిన పత్రికలు ఇవి అని మండిపడ్డారు. కరోనా వల్ల ఆదాయం పూర్తిగా పడిపోవడంతో రూపాయి పెంచి ఆ డబ్బుతో వర్షాలకు పాడైన రోడ్లు బాగుచేద్దామని చూస్తుంటే దానిపై రామోజీరావు గగ్గోలు పెడుతున్నారన్నారు.

బార్లు తగ్గించాలని చూస్తే ఇదే చంద్రబాబు తన మనుషులను కోర్టుకు పంపి గత ప్రభుత్వం ఇచ్చినట్టు 2023 వరకు బార్లు కొనసాగించాలని తీర్పులు తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని కొడాలి మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉంటూ దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మాట్లాడిన లుచ్చా చంద్రబాబునాయుడు అని…. ఇప్పుడు మాత్రం దళితులను ఉద్దరిస్తానంటూ జూమ్‌లో నాటకాలు ఆడుతున్నారన్నారు. గతంలో దళితుల మధ్య చిచ్చుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు మరోసారి కుట్రలకు దిగుతున్నారన్నారు.

ఇంతకాలం కుల రాజకీయాలు చేస్తూ బతికిన చంద్రబాబు ఇప్పుడు మతరాజకీయాలను రెచ్చగొట్టేందుకు కుట్రలు మొదలుపెట్టారన్నారు. జీవితంలో ఏ గుడి వద్ద గుండు కొట్టించుకోని చంద్రబాబు, తల్లి చనిపోయినా తలకొరివి పెట్టని చంద్రబాబు, బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబు కూడా ఇప్పుడు హిందుమతం గురించి మాట్లాడుతున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు.

చంద్రబాబు ముసుగులో ఉన్న బినామీలు, ఆయన వల్ల అవకాశాలు తెచ్చుకున్న వ్యక్తులు జగన్‌మోహన్ రెడ్డిని అడ్డుకోవాలంటే అది సాధ్యమయ్యే పనికాదన్నారు. అలాంటి వారిని ప్రజల ముందు దోషులుగా నిలబెడుతామన్నారు. జూమ్‌ యాప్‌లో కుక్క మొరిగినట్టు మొరిగి అలసిపోయి రోజూ పడుకోవడం తప్ప చంద్రబాబు సాధించేది ఇకపై ఏమీ ఉండదన్నారు. లోకేష్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవడం వేస్ట్‌ అని కొడాలి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయసు మీద పడింది కాబట్టి కరోనా వస్తే ఇబ్బంది కాబట్టి ఇంట్లో దాక్కుంటే అర్థముందని… మరి లోకేష్‌కు ఏం రోగం వచ్చి హైదరాబాద్‌లో దాక్కున్నారని ప్రశ్నించారు. కాబట్టి లోకేష్‌ లాంటి చవట గురించి మాట్లాడుకోవడం అనవసరమన్నారు.