టీడీపీ లాయర్లే జడ్జిలయ్యారు… నిష్పాక్షికమైన తీర్పులు సాధ్యమా?- లోక్‌సభలో మిథున్‌ రెడ్డి

వరుస స్టేలు, టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయకుండా ఆదేశాలు, మీడియాలో ప్రచారం చేయకుండా గ్యాగ్‌ ఆర్డర్స్‌ నేపథ్యంలో ఏపీ హైకోర్టులోని పరిణామాలపై వైసీపీ వాయిస్ మరింత పెంచింది. మరోసారి లోక్‌సభలో వైసీపీ పక్ష నేత మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ తరపున వాదించిన లాయర్లే… జడ్జిలయ్యారని లోక్‌సభ దృష్టికి మిథున్ రెడ్డి తీసుకొచ్చారు. న్యాయవ్యవస్థ నిర్మాణం నాశనం అవుతోందని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయవ్యవస్థ తన పరిధిని దాటి శాసన వ్యవస్థలోకి చొచ్చుకొస్తోందని మిథున్ రెడ్డి ఆరోపించారు. దీని వల్ల శాసన వ్యవస్థ నిర్మాణం ధ్వంసం అవుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున వాదించిన లాయర్లే… ఇప్పుడు జడ్జిలు అయ్యారని.. ఇలాంటి పరిస్థితుల్లో నిష్పాక్షికమైన తీర్పులు ఆశించలేమని మిథున్ రెడ్డి చెప్పారు.

ఏపీలో న్యాయవ్యవస్థ ఇస్తున్న తీర్పులు సరిగా లేవని… న్యాయమూర్తుల ఎంపికలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దేశం ప్రగతి మార్గాన పయనించాలంటే కొలీజయం వ్యవస్థనే తొలగించాలని మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి పీఎస్‌ ఇంట్లో రెండు వేల కోట్ల రూపాయల నల్లధనం వెలుగు చూసిందని… ఇప్పటికీ దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియడం లేదన్నారు.

అమరావతిలో కుంభకోణం జరిగిందని ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో చెప్పారని… ఏపీ బీజేపీ యూనిట్‌ కూడా అమరావతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోందని మిథున్ రెడ్డి గుర్తు చేశారు.