ఉత్తర కొరియాలో ప్రీస్కూలు పిల్లలకు ‘కిమ్’ పాఠాలు !

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కి సంబంధించిన వార్తలు తరచుగా మీడియాలో వినబడుతుంటాయి. అతని ఆరోగ్యం, అలవాట్లు, ఆలోచనలు, జీవన విధానం… అన్నీ వార్తల్లో నిలిచేలాగే ఉంటాయి. అసలు కిమ్ జీవించే ఉన్నాడా లేదా… అనేది కూడా  ఒక సమయంలో ప్రపంచ వ్యాప్తంగా చర్చగా మారింది. ఇప్పుడు మరోసారి కిమ్ పేరు వార్తల్లో నిలిచింది. ఉత్తర కొరియాలోని ప్రీస్కూలు పిల్లలు ప్రతిరోజు తొంభై నిముషాల పాటు కిమ్ వంశం గురించి తెలుసుకోవాలంటూ అక్కడి ప్రభుత్వం ఓ కొత్త చట్టం తీసుకువచ్చింది.

ఇంతకుముందు కిమ్ గురించిన పాఠాలను పిల్లలు అరగంటపాటు తప్పనిసరిగా వినాలనే ఆదేశాలు ఉన్నాయి. ఇప్పుడు గంటపాటు కిమ్ తో పాటు అతని తండ్రి, తాతల బాల్యం గురించి కూడా పిల్లలు తెలుసుకోవాలని, తరువాత మరో అరగంటపాటు ఆ నాయకులకు సంబంధించిన పాటలను వినాలనే కొత్త చట్టం చేశారు.

కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రీస్కూలు చదువులో ఈ మార్పులు చేశారు. కిమ్ తరువాత ఉత్తర కొరియాలో అంతటి శక్తిమంతమైన వ్యక్తిగా ఆయన సోదరి మారుతున్నారు. ప్రస్తుతం ఆమె ఉప అధ్యక్షపదవిలో విధులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 25 నుండి తమ నాయకుల గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉన్న పాఠాల్లో ఈ కొత్తమార్పులను ప్రవేశపెట్టారని, దేశాన్ని పాలిస్తున్న నాయకుల పట్ల నమ్మకాన్ని, విధేయతని పెంచడానికే ఈ మార్పులు చేశారని సియోల్ కి చెందిన ఆన్ లైన్ న్యూస్ పేపర్ డైలీ ఎన్ కె పేర్కొంది. ‘కిమ్ ఐదేళ్ల వయసునుండే ఎంతో తెలివిగా ఉండేవాడు, గొప్ప లక్ష్యాలతో  చాలా కష్టపడే వాడు’…కిమ్ గురించిన ఓ పాఠంలోని మాటలివి.