జడ్జిలకు భూములు ఇచ్చినట్టు చంద్రబాబే చెబుతున్నారు – పేర్నినాని

రాష్ట్రంలో టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపుడుతున్నారని మంత్రి పేర్నినాని విమర్శించారు. టీడీపీ తరపున గతంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారే ఇప్పుడు న్యాయవ్యవస్థలో ఉన్నారని ఆరోపించారు. టీడీపీ లాయర్లే… జడ్జీలుగా ఉన్నారన్న మిథున్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు.

న్యాయవ్యవస్థ తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేతుల్లో పడి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని పేర్ని నాని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులకు భూములు ఇచ్చారని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని… చంద్రబాబే అందరి కంటే ముందుగా న్యాయమూర్తులకు తాను భూములిచ్చిన అంశాన్ని చెబుతున్నారన్నారు. దీన్ని బట్టి చంద్రబాబే భూములు తీసుకున్న న్యాయమూర్తులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా ఉందన్నారు.

అమరావతి నిర్మాణం పేరుతో పెట్రోల్‌పై లీటర్‌కు రెండురూపాయలు వసూలు చేశారని ఆ సొమ్ము ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ నుంచి పెట్రోల్‌, డీజిల్‌పై 10 రూపాయలు పెంచారని మరి దాన్ని ప్రశ్నించే ధైర్యం రామోజీరావుకు ఉందా అని ప్రశ్నించారు. ఏపీలో మాత్రం కరోనా వల్ల ఆదాయం పూర్తిగా పడిపోయిన నేపథ్యంలో కాస్త పెంచగానే గుండెలు బాదేసుకోవడం ఏమిటని పేర్నినాని ప్రశ్నించారు. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క రోడ్డు కూడా వేయలేదని… ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయని… ఈ నేపథ్యంలో ఆయిల్‌పై వచ్చే ఆదాయంతో రోడ్లను బాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

రామోజీరావుకు చంద్రబాబు చేసిన దుర్మార్గాలు మాత్రం కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో కావాలనే మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందన్నారు. 40 గుళ్లు కూల్చి, బూట్లు వేసుకుని ఐదేళ్లు పూజలు చేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చంద్రబాబు హస్తముందన్నారు.

రెండు వేల కోట్ల ఫైబర్ గ్రిడ్ కుంభకోణం చిన్నదని మీడియా మాట్లాడుతోందంటే… చంద్రబాబు అవినీతి వ్యవహారాల్లో ఫైబర్‌ గ్రిడ్ చాలా చిన్నదని మీడియానే స్వయంగా చెబుతున్నట్టుగా ఉందన్నారు.