పత్రికల్లో కథనాలు, టెండర్లు రద్దు చేసుకున్న ఏపీ ప్రభుత్వం

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు- ఎన్‌డీబీ సహకారంతో రాష్ట్రంలో చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.

టెండర్లలో అక్రమాలు జరిగాయని టీడీపీ మీడియా పెద్దెత్తున కథనాలు రాయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టెండర్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తాము వివరించినప్పటికీ… అపోహలకు తావివ్వకూడదని సీఎం సూచించారని.. దాంతో టెండర్లు రద్దు చేశామని ఆర్‌ అండ్ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు చెప్పారు.

పత్రికలు అసత్య కథనాలు రాస్తున్నాయన్నది రీటెండర్ల ద్వారా ప్రజలకూ అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వారంలోనే మళ్లీ టెండర్లు పిలుస్తామని.. మరిన్ని కంపెనీలు పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ మొత్తంతో కూడిన టెండర్లలో తక్కువ కంపెనీలు పాల్గొనడం సహజమేనని… ఈ విషయాన్ని సీఎంకు వివరించినా… ఆయన పారదర్శకతకు పెద్ద పీట వేయాలని ఆదేశించారని కృష్ణబాబు వివరించారు. ఈ నెలాఖరుకల్లా టెండర్లు పూర్తి చేయాలని ఎన్‌డీబీ కోరిందని… అయితే కేంద్రంతో మాట్లాడి మరి కొంత గడువు తాము కోరుతామన్నారు.

ఇప్పటి వరకు జరిగిన టెండర్లపై ఒక్కఫిర్యాదు కూడా రాలేదని… కేవలం పత్రికలే పనిగట్టుకుని కథనాలు రాశాయన్నారు. ఈ టెండర్లను ప్రభుత్వం రద్దు చేయడానికి అటు టీడీపీ పత్రికలు తమ ఘనతగానే ప్రచురించుకున్నాయి. తమ కథనాల దెబ్బకే ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందని రాశాయి.