పిటిషన్లపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏ అంశంపైనైనా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం సరికాదని స్పష్టం చేసింది. ఏ అంశంలోనైనా కోర్టును ఆశ్రయించే ముందు ఆ అంశంపై అధికారులకు తప్పనిసరిగా వినతిపత్రం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

సమస్యపై ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని కోరకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్లు వేస్తే అవి విచారణార్హం కావు అని జస్టిస్ రాకేష్‌ కుమార్‌, జస్టిస్ బట్టు దేవానంద్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రభుత్వాన్ని న్యాయం చేయాలని కోరకుండా నేరుగా కోర్టుకు వచ్చే పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలకు విచారణార్హత ఉండదని, వాటిని విచారించడానికి వీల్లేదని తేల్చేసింది.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం కేటాయించిన నిధులను దారి మళ్లించారని… ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని గతేడాది జూన్‌లో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన శరత్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దాన్ని తాజాగా విచారించిన కోర్టు… దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.

పిల్‌లో సరైన వివరాలు లేవని, పైగా ఈ అంశంపై ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వకుండా నేరుగా కోర్టుకు రావడాన్ని ఆక్షేపిస్తూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.