ఎవర్ని ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు బాబూ…

“ప్రలోభాలకు లోనై, వ్యక్తిగత స్వార్థంతో పార్టీకి ద్రోహం చేస్తే, ప్రజలే బుద్ధి చెబుతారు, వారికి రాజకీయ సమాధే..” అంటూ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ని ఉద్దేశిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. విశాఖ టీడీపీ నేతలతో జరిగిన టెలి కాన్ఫరెన్స్ లో ఆయన ఈ మాటలన్నారు. అవును, చంద్రబాబు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం. దానికి చంద్రబాబే ప్రత్యక్ష సాక్షి. బాబు హయాంలో వైసీపీకి చెందిన 23మంది నేతలు ప్రలోభాలకు లోనై, వ్యక్తిగత స్వార్థంతో వైసీపికి ద్రోహం చేశారు. దానికి శిక్షను వారు అనుభవించారు కూడా. వైసీపీనుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏ ఒక్కరూ 2019 ఎన్నికల్లో గెలవలేదు. వారికి ప్రజలే రాజకీయ సమాధి కట్టారు. ఆ సమాధికి కారణం చంద్రబాబు ప్రలోభాలు కాక ఇంకేంటి? అంటున్నారు ప్రజలు.

పార్టీనుంచి గెలిచినవారిని పక్కనపట్టి, ఫిరాయింపుదారులకు మంత్రి పదవులిచ్చిన ఘనత చంద్రబాబుది కాదా. ఆ అవకాశవాద రాజకీయాల వల్లే ఈ దఫా టీడీపీ చరిత్రలోనే లేని విధంగా 23 సీట్ల అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఇప్పుడు ఆ 23లో కూడా కోతలు పడుతున్నాయి. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం.. ఇప్పుడు వాసుపల్లి గణేష్ తో కలిపి నలుగురు బైటకు రావడంతో టీడీపీ స్కోరు 19వద్ద ఆగింది. ఇక్కడ విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి వ్యక్తిగత స్వార్థంతో వచ్చినట్టు ఎక్కడా అనిపించడంలేదు. అదే నిజమైతే.. ఈ 15 నెలలు ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎందుకు కష్టపడతారు.

వైసీపీ గెలిచిన వెంటనే జగన్ తో మిలాఖత్ అయితే ఏడాదికి పైగా అధికార పార్టీ మనిషిగా మరిన్ని పనులు చేసుకునేవారే కదా? తన కొడుకులిద్దర్ని వైసీపీలో చేర్చిన సందర్భంగా.. జగన్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడ్ని అయ్యానని చెప్పారు వాసుపల్లి. పోనీ ఇది రొటీన్ డైలాగే అనుకున్నా.. విశాఖను పరిపాలనా రాజధాని చేయడం వల్ల తాను పార్టీ మారుతున్నట్టు చెప్పుకొచ్చారు.

చంద్రబాబు విశాఖను రాజధానిగా వద్దంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధిగా విశాఖలో ఉంటూ, విశాఖకు వ్యతిరేకంగా అమరావతి ఉద్యమం చేయడం వాసుపల్లికి సాధ్యమా. పోనీ ఆయన అలా చేస్తే స్థానిక ప్రజలు, ఆయన వర్గం ఊరుకుంటుందా? ప్రజలకోసం రాజకీయాలు చేసే ఎవరైనా.. వారి డిమాండ్ కి తగ్గట్టే నడచుకోవాలి. అందుకే వాసుపల్లి రాజధాని కోణంలో పార్టీ మారారు. నిజంగానే ఆయన వ్యక్తిగత స్వార్థంతో మారితే వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు. చంద్రబాబు శాపనార్థాలు పెట్టినా పెట్టకపోయినా ఎవర్ని ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు.