హీరో ఆర్యకు కోర్టు నోటీసులు

మొన్నటికిమొన్న కోర్టు నుంచి హీరో సూర్యకు అక్షింతలు పడ్డాయి. కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినప్పటికీ, తొలి తప్పుగా సూర్యను క్షమించి వదిలేసింది కోర్టు. ఇప్పుడు మరో నటుడు ఆర్య, కోర్టు కేసు ఎదుర్కొంటున్నాడు. పైగా ఇది 9 ఏళ్ల కిందటి సినిమాకు సంబంధించిన కేసు కావడం ఇక్కడ విశేషం.

2011లో అవన్-ఇవన్ అనే సినిమా చేశాడు ఆర్య. నిజానికి ఇందులో ఆర్య మెయిన్ హీరో కాదు. విశాల్ ఇందులో హీరో, ఆర్య సెకెండ్ హీరో. తెలుగులో ఇదే సినిమా వాడు-వీడు పేరిట రిలీజైంది కూడా. ఇప్పుడీ సినిమా వల్ల కోర్టు నుంచి నోటీసులు అందుకున్నాడు ఆర్య.

బాల డైరక్ట్ చేసిన ఈ సినిమాలో ఒకప్పటి పాలకులైన సింగంపట్టి జమీందార్లను కించపరిచేలా ఆర్య వ్యాఖ్యలు చేశాడట. 1700 సంవత్సరంలో అంబసముద్రం కేంద్రంగా సింగంపట్టి రాజులు ఆ ప్రాంతాన్ని పాలించారు. వాళ్లపై సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నాయంటూ అంబసముద్రం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈనెల 28న కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆర్యకు నోటీసులు జారీచేసింది స్థానిక కోర్టు.

ప్రస్తుతం కోలీవుడ్ లో లీడింగ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు ఆర్య. తమిళ-మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా సూర్య నటించిన బందోబస్త్ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.