ఇటు కులం, అటు మతం… మధ్యలో చంద్రబాబు…

అవకాశ వాద రాజకీయాలకు మారుపేరుగా ఉన్న చంద్రబాబు.. తన అవసరాలకోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని.. దేన్నీ వదిలిపెట్టడంలేదు. దళితులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆమధ్య ఆన్ లైన్ లో దళిత శంఖారావం పూరించారు బాబు. బీసీ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నారంటూ.. కొన్నాళ్లు బీసీ జపం చేశారు. మూడు రాజధానులపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కూడా ప్రయత్నం చేశారు.

ఇటీవల అంతర్వేది ఘటనతో బాబు కొత్తగా మత రాజకీయాలు మొదలు పెట్టారు. అంతర్వేది ఘటన పాతపడిందని అనుకున్నారేమో.. ఇప్పుడు తిరుమల డిక్లరేషన్ రాజకీయాన్ని భుజానికెత్తుకున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనబోతున్న సీఎం జగన్ డిక్లరేషన్ సమర్పించాల్సిందేనని పట్టుబడుతున్నారు టీడీపీ నేతలు. అలిపిరి వద్ద పొర్లు దండాలు పెట్టి మరీ ఆందోళన చేపట్టారు. మరోవైపు చంద్రబాబు కూడా సంస్కృతి, సంప్రదాయాలు అంటూ లెక్చర్లిస్తున్నారు.

అసలు రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కులం, మతం, ప్రాంతం అంటూ చంద్రబాబు ఏం సాధించబోతున్నారు? ముఖ్యమంత్రి హోదాలో గతేడాది జగన్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఏడాది కాలంలో ఆయనలో వచ్చిన మార్పేంటి? ఏడాది తిరిగేలోగా జగన్ లో శ్రీవారిపై భక్తి తగ్గిపోయిందా? కొత్తగా డిక్లరేషన్ రాసిచ్చి ఆయన తన భక్తిని నిరూపించుకోవాలా? డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు చేస్తున్న హడావిడి చూస్తుంటే హిందూత్వ వాదులే ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంతగా దిగజారిపోయి రాజకీయాలు చేయాలా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

బీజేపీతో అంటకాగాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో చంద్రబాబు మత రాజకీయాలు చేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు దాదాపుగా అర్థమైపోయింది. రాష్ట్రంలో లేనిపోని అలజడి సృష్టించి.. ఆ మంటల్లో తాను చలి కాచుకోవాలని చూస్తున్నారు చంద్రబాబు. తిరుమల డిక్లరేషన్ పేరుతో తాజాగా టీడీపీ నాయకులు చేస్తున్న హడావిడి చూస్తుంటే చంద్రబాబు మత రాజకీయాలకు ఫిక్స్ అయిపోయారని అర్థమవుతోంది.