విశ్వకర్మ జయంతిని వర్థంతిగా, విశ్వబ్రాహ్మణులను నాయీ బ్రాహ్మణులు అన్న బాబు… సంఘాల ఆగ్రహం

చంద్రబాబునాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై విశ్వబ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 17న విశ్వకర్మ జయంతిని చంద్రబాబు వర్థంతిగా వ్యాఖ్యానించినట్టు… విశ్వ బ్రాహ్మణులకు బదులు నాయీ బ్రాహ్మణులుగా చంద్రబాబు చెప్పినట్టు ఏబీఎన్ చానల్‌లో ప్రసారం అయిందని విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు మయ బ్రహ్మచారి వ్యాఖ్యానించారు.

తక్షణం చంద్రబాబునాయుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తక్షణం క్షమాపణ చెప్పాలంటూ విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు గుంటూరులో ఆందోళన నిర్వహించారు.

చంద్రబాబుకు మొదటి నుంచి వెనుకబడిన వర్గాలు అంటే చిన్నచూపు ఉందని వారు ఆరోపించారు. హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు చేరుకుని వారికి నచ్చజెప్పి కిందకు దింపారు.