రఘురామకృష్ణంరాజు సెక్యూరిటీని తొలగించాల్సిందిగా ఫిర్యాదు చేస్తాం… – ఎంపీ నందిగం సురేష్

ఇటీవల తనపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ తీవ్రంగా స్పందించారు. తనకున్న సెక్యూరిటీతో తోలు వలిచిస్తానని… కాల్చి పారేయిస్తానంటూ రఘురామకృష్ణంరాజు బెదిరించారని గుర్తు చేశారు. సెక్యూరిటీ ఇచ్చింది రక్షణ కోసమే గానీ… దళితులను కాల్చి చంపడానికి కాదు అన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇలాంటి వ్యక్తికి సెక్యూరిటీ కొనసాగిస్తే దాంతో ప్రజల ప్రాణాలు తీసేలా ఉన్నాడని అభిప్రాయపడ్డారు. అందుకే రఘురామకృష్ణంరాజు సెక్యూరిటీని తొలగించాల్సిందిగా లోక్‌సభ స్పీకర్‌ను కలిసి కోరుతామన్నారు.

దళితులపై చులకన వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణంరాజుకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే రఘురామకృష్ణంరాజు పెట్టుకున్నారని… తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ అందుకుంటారని సురేష్ వ్యాఖ్యానించారు. త్వరలోనే రఘురామకృష్ణంరాజును తప్పకుండా పదవి విషయంలో, విగ్గు విషయంలో ఒరిజినల్ స్థితికి తెస్తామని నందిగం సురేష్‌ హెచ్చరించారు.

పులివెందులలో పది వేల మందితో మీటింగ్‌ పెడతానని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారని… కానీ అడవిలో గర్జించడానికి వీధుల్లో మొరగడానికి చాలా తేడా ఉంటుందన్న విషయం గుర్తించుకోవాలన్నారు.

ఇప్పటికే సురేష్‌ జాతీయ ఎస్సీ కమిషన్‌ను కలిసి రఘురామృకష్ణంరాజుపై ఫిర్యాదు చేశారు. తనపై చులక వ్యాఖ్యలు చేయడంతో పాటు, దళితుల కులవృత్తులను హేళన చేసిన రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని కోరారు.