జగన్‌ డైనమిక్ సీఎం… ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి – కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన విధానాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ప్రశంసించారు. వైఎస్‌ జగన్‌ డైనమిక్ సీఎం అని అభివర్ణించారు. వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నారని కితాబిచ్చారు. ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఢిల్లీలో ఆర్‌కే సింగ్‌ను కలిశారు. ఏపీలో విద్యుత్‌ రంగంలో తీసుకుంటున్న చర్యలను వివరించారు.

వ్యవసాయ ఉచిత విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో వేసేందుకు నిర్ణయించిన విషయాన్ని వివరించారు. నగదు బదిలీ ఆలోచన చాలా సాహసోపేతమని… రైతులకు మేలు చేయాలన్న సీఎం ఆలోచన అభినందనీయమని ఆర్‌కే సింగ్ వ్యాఖ్యానించారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శనంగా తీసుకోవాలని సూచించారు.

రైతుల కోసం ప్రత్యేకంగా 10వేల మెగావాట్ల సోలార్‌ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు గురించి ఏపీ అధికారులు వివరించగా… ఇందుకు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి అవసరమైన సహాయం అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లే జగన్‌ లాంటి పాలకులు అవసరమని కేంద్రమంత్రి ఆర్‌ కే సింగ్ అభిప్రాయపడ్డారు.