మా వద్ద గ్యాగ్ ఆర్డర్స్ ఉండవు – బొంబే హైకోర్టు జస్టిస్ గౌతమ్ పటేల్‌

గ్యాగ్ ఆర్డర్స్‌పై బొంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక బ్రోకరేజ్ సంస్థ అక్రమాలకు సంబంధించిన కేసువిచారణ సందర్భంగా జస్టిస్ పటేల్ మీడియా స్వేచ్చను అడ్డుకోలేమని వ్యాఖ్యానించారు.

కేసుకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో సమర్పించడంతో ఆగ్రహించిన న్యాయమూర్తి… తన ధర్మాసనం ముందు ఇలాంటి సీల్డ్ కవర్ వ్యవహారాలకు తావు లేదని తేల్చేశారు. ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని ఆదేశించారు. నివేదికలో సున్నితమైన అంశాలున్నాయని, మీడియాకు చేరితే ఇబ్బంది అని బ్రోకరేజ్ సంస్థ చెప్పగా న్యాయమూర్తి మరింత తీవ్రంగా స్పందించారు.

తాను కేవలం తన ముందు ఉన్న పత్రాల ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తానే గానీ… తన ఇంటికి వచ్చే వార్తా పత్రికలు చూసి కాదు అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మీడియా పని మీడియా చేస్తోంది… తన పని తాను చేస్తాను అని గౌతమ్ పటేల్ వ్యాఖ్యానించారు. ప్రతివాది అడిగినంత మాత్రాన మీడియాను అడ్డుకోలేమని… ఇక్కడ గ్యాగ్ ఆర్డర్లు ఉండవని గౌతమ్ పటేల్ స్పష్టం చేశారు.