క్రేజీ రీమేక్స్ అన్నీ అక్కడే

టాలీవుడ్ లో రీమేక్స్ సహజం. అలాంటి రీమేక్స్ అన్నీ ఒకే కాంపౌండ్ లో కనిపిస్తే మాత్రం కచ్చితంగా అది వార్తే. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న దాదాపు రీమేక్స్ అన్నీ మెగా కాంపౌండ్ తో కనెక్షన్ ఉన్నవే కావడం విశేషం.

ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్న టాపిక్ ‘వేదాళం’ రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఈ సినిమా రాబోతోంది. అతి త్వరలో దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది. ఇక ‘లూసిఫర్’ రీమేక్ కూడా మెగా కాంపౌండ్ సినిమానే. సుజీత్, ఈ ప్రాజెక్టుకు చేయాల్సిన మార్పుచేర్పులన్నీ చేశాడు. త్వరలోనే వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

వీటితో పాటు ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే మరో రీమేక్ కూడా మెగా కాంపౌండ్ చుట్టూనే తిరుగుతుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్నట్టు సమాచారం. సో.. ఈ సినిమాలో కచ్చితంగా మెగా హీరోనే నటిస్తాడు.

వీటితో పాటు చాలామంది హీరోల చుట్టూ తిరిగిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ అనే రీమేక్ ప్రాజెక్టు కూడా పవన్ వద్దకు చేరినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఆల్రెడీ పవన్ చేతిలో ‘వకీల్ సాబ్’ అనే రీమేక్ ప్రాజెక్టు ఉంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో నలుగుతున్న క్రేజీ రీమేక్ ప్రాజెక్టులన్నీ మెగా కాంపౌండ్ లోనే నలుగుతున్నాయి.