పార్లమెంట్ సాక్షిగా ఫలించిన వైసీపీ వ్యూహం…

అమరావతిని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. అమరావతిలో జరిగిన భూ కుంభకోణాన్ని ఏకంగా జాతీయ స్థాయిలో ఎండగట్టారు వైసీపీ ఎంపీలు.

పార్లమెంట్ లోపలా, బయటా.. అమరావతి భూముల కుంభకోణం, విచారణను కోర్టులు అడ్డుకోవడం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం గురించి మాట్లాడి జాతీయ స్థాయిలో బాబు గురించి చర్చించుకునేలా చేశారు. చంద్రబాబు జూమ్ యాప్ లో ఎన్ని వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టుకున్నా.. చంద్రదండు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా లాభం లేకపోయింది.

అదే సమయంలో పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ వ్యూహం పనిచేసింది. రాజధాని పేరు చెప్పి రైతుల్ని ఎలా ముంచారో, బినామీలతో ఎలా భూములు కొన్నారో, న్యాయవ్యవస్థను తప్పుదారి పట్టించి స్టేలతో ఎలా కాలం గడుపుతున్నారో.. పార్లమెంట్ సాక్షిగా వివరించారు వైసీపీ ఎంపీలు.

ఓవైపు వ్యవసాయ బిల్లులతో పార్లమెంట్ అట్టుడుకుతున్నా.. మరోవైపు వైసీపీ ఎంపీలు మాత్రం తమ డిమాండ్ ని ఆపలేదు. అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని సభ లోపల, బైట కూడా గట్టిగా తమ వాణి వినిపించారు. అనుకూల మీడియాతో చంద్రబాబు ఎంత కవర్ చేసుకోవాలని చూసినా.. హస్తినలో ఆయన పరువు మంటగలిసింది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన ఎంపీలంతా చంద్రబాబు వ్యవహారంపై ఆరా తీయడం మొదలు పెట్టారట.

అసలేంటి అమరావతి కుంభకోణం, ఐదేళ్లలో అక్కడ చంద్రబాబు ఏం చేశారు, ఎన్ని ఎకరాలు సేకరించారు, చివరకు రైతులు రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చిందనే విషయాలని రాష్ట్ర ఎంపీలను అడిగి తెలుసుకుంటున్నారట. సీబీఐ ఎంక్వయిరీ వేస్తే నిజానిజాలు తేలుతాయి కదా, మరి ఎందుకు వెనకాడుతున్నారని కూడా ఆరా తీశారట. చివరకు విషయం తెలుసుకుని, చంద్రబాబు భూ బాగోతం చూసి ముక్కున వేలేసుకున్నారట.

జాతీయ నాయకుడిగా బిల్డప్ ఇచ్చే చంద్రబాబు, సొంత రాష్ట్రంలో ఇంత అవినీతికి పాల్పడ్డారా అని ఆశ్చర్యపోయారట ఇతర పార్టీల ఎంపీలు.

మొత్తమ్మీద పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపు వైసీపీ ఎంపీలు తాము అనుకున్న పనిని అనుకున్నట్టుగా పూర్తి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అవినీతి గురించి చర్చ మొదలయ్యేలా చేశారు.