ఒక్కరోజులో లక్షమందికి పైగా డిశ్చార్జ్ !

మంగళవారం ఒక్కరోజే లక్షమందికి పైగా కోవిడ్ బాధితులు దాని నుండి బయటపడి డిశ్చార్జ్ అయ్యారు. ఒకే రోజు 1,01,468 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారని, దీంతో భారత్ లో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 44,97,867కి చేరుకుందని, రికవరీ రేటు 80.86గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మొత్తం కోలుకున్నవారిలో 79శాతం మంది… మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ లకు చెందినవారే. మహారాష్ట్రలో అత్యధికంగా 32వేల మంది డిశ్చార్జ్ కాగా ఆంధ్రప్రదేశ్ లో పదివేలమంది వరకు మంగళవారం కోవిడ్ నుండి కోలుకున్నారు. వరుసగా నాలుగవ రోజు కూడా కరోనానుండి కోలుకున్నవారి సంఖ్య అత్యధికంగా నమోదు కావటంతో కోవిడ్ రికవరీల రీత్యా భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న వైద్య విధానాలను, శాస్త్రీయ పరిశోధనలను కోవిడ్ చికిత్సలో చేరుస్తూ, కొత్త మందులు, థెరపీలకు అనుమతులివ్వటం వలన ఇది సాధ్యమైందని ఆరోగ్య శాఖ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఎయిమ్స్ తో కలిసి దేశవ్యాప్తంగా కోవిడ్ మేనేజ్ మెంట్ విషయంలో నిర్వహిస్తున్న ఈ-ఐసియు (ఎలక్ట్రానిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) అనే కార్యక్రమం మంచి ఫలితాలను ఇచ్చిందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో టెలీ కన్సల్టేషన్ సెషన్లను నిర్వహిస్తున్నారు. నిపుణులైన ఐసియు డాక్టర్లు ఇందులో సలహాలు సూచనలను అందిస్తున్నారు.   ఇప్పటివరకు 20 జాతీయ ఈ-ఐసియు కార్యక్రమాలు  నిర్వహించగా…  దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలనుండి 278 హాస్పటల్స్ వీటిలో పాల్గొన్నాయి.