చంద్రబాబుకి రివర్స్ లో తగిలిన డిక్లరేషన్ రాజకీయం…

అన్యమతస్తులు తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలంటూ సీఎం జగన్ ని టార్గెట్ చేస్తూ చంద్రబాబు మొదలు పెట్టిన డిక్లరేషన్ రాజకీయం పూర్తిగా ఆయనకు రివర్స్ లో తగిలినట్టు తెలుస్తోంది.

బీజేపీ సపోర్ట్ వస్తుందనుకున్నా.. వాళ్లు ఈ విషయాన్ని ఏమాత్రం పూసుకోలేదు. కాషాయదళం స్పందించలేదు కాబట్టి, జనసేన కూడా పట్టించుకోలేదు. ఇక చంద్రబాబు ఒక్కరే జగన్ డిక్లరేషన్ పై పార్టీ శ్రేణుల్ని పురిగొల్పి చిత్తూరు జిల్లాలో ఆందోళనలు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు జిల్లా నేతలతో జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ఈ విషయంపై వారికి హితబోధ చేశారు కూడా.  జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబట్టాలని, తిరుపతిలో ఆందోళన చేయాలని సూచించారట.

బ్రహ్మోత్సవాల సమయంలో ఒంటరిగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అరిష్టం అని కూడా చంద్రబాబు అన్నట్టు టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది.

ఇంతకీ జగన్ ఒంటరిగా వెళ్తారని చంద్రబాబుకి ఏం తెలుసు? పోనీ వెళ్లారే అనుకుందాం అంతమాత్రాన రాష్ట్రానికి అరిష్టం ఎలా జరుగుతుంది? ఈ వార్త సోషల్ మీడియాలోకి రాగానే చంద్రబాబుపై విపరీతంగా వ్యతిరేక కామెంట్లు పడ్డాయి.

అయోధ్యలో ప్రధాని మోదీ రామమందిరానికి శంకుస్థాపన చేసినప్పుడు ఆయన ఎవరిని వెంట తీసుకెళ్లారని నెటిజన్లు ప్రశ్నించారు? మోదీ ఒంటరిగా శంకుస్థాపన చేసినప్పుడు దేశానికి అరిష్టం జరుగుతుందని చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదని పాయింట్ తీశారు కొంతమంది.

గతంలో చంద్రబాబు బూట్లు వేసుకుని పూజలు చేయడం, బూట్లు విడవకుండానే దేవుడి పటాలను తాకడం, బైబిల్ చదువుతున్న ఫొటోలు, వీడియోలు.. ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతూ స్పందించారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా చంద్రబాబుని సమర్థిస్తూ కామెంట్ పెట్టలేదంటే ఈ విషయంలో చంద్రబాబు పూర్తిగా రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అర్థమవుతుంది.

మతాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబు సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్న పరిస్థితి. పోనీ డిక్లరేషన్ పేరుతో జరుగుతున్న రాజకీయంలో చంద్రబాబుకి ఎవరైనా సపోర్ట్ గా నిలిచారా అంటే అదీ లేదు. అంతర్వేది అంశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి కానీ, జగన్ తిరుమల యాత్రలో గందరగోళం సృష్టించడానికి బాబు వేస్తున్న ఉచ్చులో ఎవరూ చిక్కుకోలేదు, చిక్కుకోరు కూడా.