జగన్‌ ఢిల్లీ టూర్‌లో అదే కీలక అంశమా?, జగన్ వెంట మాజీ జస్టిస్ కుమారుడు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు అమరావతి భూకుంభకోణం, న్యాయవ్యవస్థ నుంచి ఎదురవుతున్న సవాళ్లపైనా, శాసనవ్యవస్థ పరిధిలోకి న్యాయవ్యవస్థ దూసుకొస్తున్న అంశాలపైనా అమిత్ షా, జగన్‌ భేటీలో ప్రముఖంగా చర్చ జరిగినట్టు చెబుతున్నారు.

ఈసారి ఢిల్లీ పర్యటనకు జగన్‌మోహన్ రెడ్డి తన వెంట ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరాంతో పాటు న్యాయవాది భూషణ్‌ను తీసుకెళ్లారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్‌ కుమారుడే ఈ భూషణ్.

అమరావతి, ఫైబర్‌ గ్రిడ్‌ కుంభకోణాలు, న్యాయస్థానంలో ప్రభుత్వానికి ఎదురవుతున్న సవాళ్లను ఢిల్లీలో వివరించేందుకే అడ్వకేట్ జనరల్‌తో పాటు జస్టిస్ చలమేశ్వర్ కుమారుడిని జగన్‌మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గతంలో జస్టిస్ చలమేశ్వర్‌ న్యాయవ్యవస్థలో చంద్రబాబు అతి జోక్యాన్ని బహిరంగంగానే తప్పుపట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో చంద్రబాబు… న్యాయవ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న మరో వ్యక్తితో కలిసి పనిచేస్తున్న విధానాన్ని లేఖ ద్వారా అప్పట్లో వివరించారు.

జగన్, అమిత్ షా భేటీ సమయంలోనే…. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పికే మిశ్రా, ప్రధాన మంత్రి సలహాదారు భాస్కర్‌ కుల్బేలతో వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు వీడియో కాన్ఫరెన్స్‌లో భేటీ అయ్యారు.