సంక్షోభంలో టెలివిజన్ రంగం…. ప్రభుత్వం అండగా ఉంటుందన్న విజయసాయి

కోవిడ్ నేపథ్యంలో మార్కెటింగ్ రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల్ని కూలంకషంగా చర్చించింది గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ – 2020. ఈ సమ్మిట్లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కీలక ప్రసంగం చేశారు. కరోనా పారిశ్రామిక రంగాన్ని కుదేలు చేసిందని, దీనివల్ల మార్కెటింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ఆయన తెలిపారు. మళ్ళీ ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడేందుకు నాలుగైదు సంవత్సరాలు పడుతుందని అన్నారు.

ఇదే సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రభుత్వం ఎలా బాసటగా నిలుస్తుందన్న అంశంపై వివరించారు. కోవిడ్ వల్ల అన్నిరంగాలూ ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాయని, ఇలాంటి సమయంలో అండగా ఉండడానికి… పరిశ్రమలకు బాసటగా నిలవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. ఇదే సమావేశంలో పాల్గొన్న మరో వక్త, ఏపీ 24×7 సీఈవో సుధాకర్ అడపా మాట్లాడుతూ… టెలివిజన్, ప్రకటనల రంగాలు ఎలాంటి ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయో సవివరంగా ఆవిష్కరించారు.

అర్బన్ మార్కెట్లో ఇప్పటికీ టీవీ, డిజిటల్ రంగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్నాయని, గ్రామీణ మార్కెట్లో టీవీ ప్రకటనలకు ఎక్కువ మంది ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని అన్నారు. గత యేడాదితో పోలిస్తే కరోనా వల్ల ఈ యేడాది టీవీ రంగానికి ప్రకటనలు 40 నుంచి 80 శాతం వరకు తగ్గిపోయాయని అన్నారు. సంక్షోభం నుంచి టెలివిజన్ రంగం ఇపుడిపుడే బయట పడుతుందని… రాబోయే కాలం ఆశాజనకంగా ఉంటుందనడంలో సందేహం లేదని సుధాకర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేట్ దిగ్గజాలు, అంతర్జాతీయ బిజినెస్ టైకూన్స్… కార్తీ మార్షమ్, చంద్రమోహన్ మెహ్ర, సుఖ్లీమ్ అనేజా, లారా బల్సారా, హర్ష అగర్వాల్, సుధాకర్ అడపా తదితరులు కరోనా నేపథ్యంలో మార్కెటింగ్, టెలివిజన్, ప్రకటనల రంగాలు ఎదుర్కొంటున్న పలు అంశాలను కూలంకషంగా చర్చించారు.

గత ఆరు నెలల కాలంలో మార్కెటింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్ని ఎదుర్కొందని, ఇపుడిపుడే కుదుట పడుతుందని… వచ్చే ఆరు నెలల కాలంలో మరింత పురోగతి సాధించే అవకాశం ఉందని అన్నారు. వీరి ప్రసంగం టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాలకు కొంత ఊరట ఇచ్చిందనే చెప్పాలి.

– చెన్ను పెద్దిరాజు