డ్రగ్స్ కేసులో రకుల్ కు నోటీసులు

అంతా ఊహించిందే జరిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది. రేపే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. మొన్ననే రకుల్ ముంబయి వెళ్లింది. డ్రగ్స్ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన పేరు మీడియాలో రాకుండా చూడాలని అభ్యర్థించింది. అంతలోనే ఎన్సీబీ ఇలా నోటీసులు ఇచ్చింది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. నిన్ననే అన్నీ సెట్ చేసుకొని హైదరాబాద్ వచ్చింది రకుల్. ఈరోజు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంది. సమన్లు అందడంతో రేపు మళ్లీ ముంబయి వెళ్లబోతోంది. మళ్లీ ఎప్పుడు హైదరాబాద్ వస్తుందనేది ఇప్పుడు రకుల్ చేతిలో లేదు. పూర్తిగా అంతా ఓకే అనుకుంటే రకుల్ ను వదిలేస్తుంది ఎన్సీబీ. లేదంటే ముంబయిలో ఉండాల్సిందే.

క్వాన్ సంస్థకు చెందిన కరిష్మా, జయ సాహా ను 2 రోజులుగా విచారించిన ఎన్సీబీ అధికారులు రకుల్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. అంతకంటే ముందు విచారణలో రియా చక్రబొర్తి రకుల్ పేరును వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. ఈరోజు రకుల్ కు నోటీసులు ఇవ్వడంతో.. గతంలో వచ్చిన వార్తలన్నీ నిజమని తేలాయి.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి దీపిక పదుకోన్, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్ లకు కూడా నోటీసులు జారీచేసింది ఎన్సీబీ.