డాక్టర్‌ రమేష్‌బాబుకు నోటీసులు… నేరుగా రాను అంటున్న డాక్టర్

స్వర్ణప్యాలెస్ హోటల్ అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోవడానికి కారణమైన రమేష్ ఆస్పత్రి కేసులో పోలీసులు మళ్లీ దర్యాప్తు మొదలుపెట్టారు. పోతినేని రమేష్ బాబుపై దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పోలీసులు పని మొదలుపెట్టారు.

ఇందులో భాగంగా విచారణకు హాజరుకావాల్సిందిగా డాక్టర్ రమేష్‌ బాబుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ 160 కింద నోటీసులిచ్చారు.

ఈ నోటీసులకు రమేష్‌ బాబు నుంచి వస్తున్న సమాధానం కూడా అసాధారణంగానే ఉంది. కరోనా ఉంది కాబట్టి తాను నేరుగా విచారణకు హాజరుకాను అని రమేష్ బాబు చెప్పారు. కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొంటానని చెబుతున్నారు.

దీనికి పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ పోలీసుల విచారణ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో చేస్తే… మిగిలిన అన్ని కేసుల్లోనూ ఇదే సమన్యాయాన్ని పాటించాల్సి రావొచ్చు.