బాలు ఆరోగ్య పరిస్థితి విషమం…

కరోనా నుంచి కోలుకుంటున్నారనుకున్న బాలు, తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితేం బాగాలేదని ప్రకటించారు ఆస్పత్రి వైద్యులు. గడిచిన 24 గంటలుగా బాలు ఆరోగ్యం క్షీణించిందని చెబుతున్నారు.

కరోనా వైరస్ బారిన పడి ఆగస్ట్ 5న ఎంజీఎం హాస్పిటల్ లో చేరారు గానగంధర్వుడు బాలు. అప్పట్నుంచి ఆయన చికిత్స తీసుకుంటూనే ఉన్నారు. హాస్పిటల్ వర్గాలు, బాలు తనయుడు చరణ్ ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో బాలు ఆరోగ్యం మెరుగైనట్టు కొన్ని రోజుల కిందట చరణ్ ప్రకటించాడు. ఆయన లేచి కూర్చుంటున్నారని, నోటితో ఆహారం తీసుకుంటున్నారని కూడా తెలిపాడు. అంతేకాదు.. హాస్పిటల్ లోనే ఆయన పెళ్లి రోజును కూడా సెలబ్రేట్ చేశారు.

అయితే కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చినప్పటికీ… ఊపిరితిత్తుల సమస్యను ఎదుర్కొంటున్నారు. వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ తీసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్టు, ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.