కోటి అప్పుకు 10 కోట్ల భూమి కాజేసిన పరిటాల కుటుంబం

మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యుల భూబాగోతం బయటపడింది. ఒక వ్యక్తికి కోటి రూపాయలు అప్పు ఇచ్చి 10కోట్ల విలువైన భూమిని కాజేశారు. పరిటాల సునీత కుటుంబం మేడా చంద్రశేఖర్ శెట్టి అనే వ్యాపారికి కోటి రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ అప్పుకు తాకట్టు కింద 10 కోట్ల రూపాయల విలువైన భూమిని పెట్టుకున్నారు. అప్పుపై రూ. 2.75 వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.

ఇప్పుడు తాను అప్పు చెల్లిస్తానంటున్నా తాకట్టు పెట్టుకున్న భూమిని తిరిగి ఇవ్వడం లేదని బాధితుడు మేడా చంద్రశేఖర్ వాపోతున్నాడు. కోటి రూపాయల అప్పుకు మొత్తం 10 కోట్ల రూపాయల విలువైన భూమిని జమ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన చెందుతున్నాడు.

అప్పు తీసుకున్న సమయంలో తాను కురుగుంట గ్రామం వద్ద ఉన్న 10 కోట్ల రూపాయల విలువైన భూమిని తాకట్టుగా పెట్టానని చెబుతున్నాడు. ఇప్పుడు అప్పు చెల్లిస్తానంటున్నా ఆ భూమిని తిరిగి అప్పగించేందుకు అంగీకరించడం లేదంటున్నారు. బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మేడా చంద్రశేఖర్ చెబుతున్నాడు. భూమిని పరిటాల సునీత తమ్ముడు మురళీ మామ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

డబ్బులు చెల్లిస్తాను భూమి తిరిగి ఇప్పించండి అంటూ తాను పరిటాల సునీత, పరిటాల శ్రీరాం వద్దకు వెళ్లి వేడుకున్నా అందుకు వారు అంగీకరించడం లేదని మేడా చంద్రశేఖర్ శెట్టి చెబుతున్నారు.