దెబ్బకి షూటింగ్ ఆపేసింది

డ్రగ్స్ ఆరోపణలు హీరోయిన్ దీపిక పదుకోన్ కు గట్టిగానే తగిలాయి. ఇలా ఆరోపణలు వచ్చాయో లేదో అలా దీపిక నటిస్తున్న సినిమా ఒకటి ఆగిపోయింది. మొన్నటివరకు ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఎప్పుడైతే డ్రగ్స్ కోసం దీపిక ఛాట్ చేసినట్టు వాట్సాప్ స్క్రీన్ షాట్లు బయటకొచ్చాయో, ఆ క్షణమే షూటింగ్ కు ప్యాకప్ చెప్పేశారు. ఆ వెంటనే దీపికను విచారణకు రావాల్సిందిగా ఎన్సీబీ నోటీసులు కూడా జారీచేసింది.

డ్రగ్స్ ఆరోపణలతో ఇప్పటికే రకుల్ షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు ఓసారి ఆమె షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఒకే ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంది. ఇప్పుడు మళ్లీ విచారణ కోసం ముంబయికి వెళ్తోంది. ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా దీపిక నటిస్తున్న సినిమాను నిరవధికంగా వాయిదా వేశారు.

దీపిక పదుకోన్, మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ కోసం ఛాటింగ్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. క్వాన్ సంస్థకు చెందిన జయ సాహా వాట్సాప్ ఛాట్స్ లో ఈ విషయం బయటపడింది. అందులో దీపిక “మాల్” ఉందా అని కరిష్మాను కోరినట్టు ఉంది. అంతేకాకుండా “వీడ్” వద్దు “హాష్” కావాలనే మెసేజ్ కూడా ఉంది. రేపు దీపిక పదుకోన్ ను ఎన్సీబీ అధికారులు విచారించబోతున్నారు.