జగన్ ని టార్గెట్ చేస్తే… నాని ఇరుక్కుపోయారా…?

చంద్రబాబు టార్గెట్ సీఎం జగన్. అంతర్వేది ఘటన అయినా, తిరుమల డిక్లరేషన్ వ్యవహారం అయినా.. మతాన్ని రెచ్చగొట్టి జగన్ ని కార్నర్ చేయాలనేది ఆయన ఆలోచన.

అంతర్వేది వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయడంతో బంతి కేంద్రం కోర్టులో పడింది. ఇక డిక్లరేషన్ వ్యవహారంలో ఎంత గొడవ చేసినా ఫలితం కనిపించలేదు. ఎవరూ కలసి రాలేదు, ప్రజలెవరూ పట్టించుకోలేదు, పైగా చంద్రబాబుపైనే తీవ్ర విమర్శలు చెలరేగాయి.

అయితే అనుకోకుండా ఈ వివాదంలో మంత్రి కొడాలి నాని హైలెట్ అయ్యారు. ఒరిజినల్ అయినా, వక్రీకరించారని అనుకున్నా.. ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం గురించి నాని స్పందన సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొట్టింది. శ్రీవారికి ఒంటరిగా పట్టు వస్త్రాలు సమర్పించడాన్ని విమర్శిస్తున్న చంద్రబాబుని కట్టడి చేసేందుకు.. ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లు ప్రస్తావించారు నాని.

అక్కడే వ్యవహారం సైడ్ ట్రాక్ లోకి వెళ్లింది. చంద్రబాబు నిప్పురాజేసి పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడా మంటను బీజేపీ నేతలు ఎగదోస్తున్నారు. అసందర్భంగా ప్రధాని మోదీ పేరు ఎందుకు ప్రస్తావించారంటూ ప్రశ్నిస్తున్నారు. కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సందట్లో సడేమియా అన్నట్లు.. టీడీపీ అనుకూల మీడియా ఏకంగా కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని వార్తలు వండి వారుస్తోంది.

మొత్తమ్మీద జగన్ ని టార్గెట్ చేయడానికి మంత్రి నాని వ్యాఖ్యలని వాడుకుంటున్నారు చంద్రబాబు. వ్యవహారం పూర్తిగా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయాక ఆయన పక్కకు తప్పుకున్నారు. బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వ్యవహారం ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.