ఏపీ విధానాలపై ప్రధాని ప్రశంస

ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోడీ ఏపీ ప్రభుత్వ విధానాలను అభినందించారు.ఏపీని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమల వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి… అన్నమయ్య భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్నారు.

జగన్‌మోహన్ రెడ్డి వెనుక వెంకటేశ్వరస్వామి చిత్రపటం ఉండడం చూసిన ప్రధాని నరేంద్రమోడీ… మీ వల్ల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం కలిగింది. సంతోషంగా ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరై కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం అని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వార్డు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ బాగా పనిచేస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈవ్యవస్థ వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతున్నాయని ప్రశంసించారు. ఏపీలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తే బాగుంటుందని… అలా చేస్తారని ఆశిస్తున్నానని ప్రధాని చెప్పారు.

విపత్కర పరిస్థితుల్లోనూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు అభినందనలు అంటూ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు.