మంచినీళ్లతో… రోగనిరోధక శక్తి!

రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి… అందుకోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి… అనే అంశాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఒకటుంది. మనం తాగే మంచినీళ్లు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు వైద్య నిపుణులు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం….

  • తగినంత నీటిని తాగటం వలన ఎముకలకు సంబంధించిన అనారోగ్యాలను నివారించవచ్చు. కీళ్లవాపులు, నొప్పులు లాంటి సమస్యలను నియంత్రించవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉన్న నీటిని తాగటం వలన ఎముకలు బోలుగా మారిపోయే ఆస్టియో పోరోసిస్ ని సైతం నివారించవచ్చు…  అదుపులో పెట్టుకోవచ్చు.
  • తగినంత స్థాయిలో నీరు తాగకపోతే మన మెదడు సెరటోనిన్ అనే రసాయనాన్ని  ఉత్పత్తి చేయలేదు. సెరటోనిన్ మన మానసిక స్థితిని స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది. మన మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఇది చాలా అవసరం. నిద్రకు అవసరమైన మెలటోనిన్ ని మన మెదడు తగినంత స్థాయిలో ఉత్పత్తి చేయాలన్నా నీరు కావాలి. అంటే అవసరమైనన్ని నీళ్లు తాగకపోతే నిద్రలేమికి కూడా దారితీయవచ్చు.
  • మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సవ్యంగా పనిచేయాలంటే నీటి అవసరం చాలా ఉంది. మన రోగనిరోధక వ్యవస్థ… శరీరంలోని కణజాలం అంతటికి శోషరసం ద్వారా తెల్లరక్తకణాలను, పోషకాలను పంపుతుంటుంది. అంటే రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే శోష రసం అవసరం. ఈ శోషరసం ఉత్పత్తి కావాలంటే శరీరంలో తగినంత నీరు ఉండాలి. శోషరసం లేకపోతే వ్యాధులను ఎదుర్కొనే తెల్లరక్తకణాలు, ఇతర రోగనిరోధక కణాలు శరీరం అంతటా ప్రయాణం చేయలేవు.
  • జీర్ణక్రియ సవ్యంగా జరగాలన్నా, రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరంలోని కణజాలాలకు అందాలన్నా నీరు చాలా అవసరం. శరీరంలోని మలినాలు మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లాలన్నా తగినంత స్థాయిలో నీరు ఉండాల్సిందే. శరీరంలో సరిపడా నీరు లేకపోతే విషాలు పేరుకుపోయి రోగనిరోధక శక్తికి అవి అడ్డుపడతాయి. నీరు తక్కువగా తాగేవారు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి.