ఢీ-2 కన్ఫర్మ్ చేసిన హీరో

ఇప్పటి ప్రేక్షకులకు “ఢీ” అంటే అదేదో డాన్స్ షో అనుకుంటారు. కొన్నేళ్ల కిందటొచ్చిన ఢీ అనే సినిమా వీళ్లకు గుర్తురాదు. అంత పాతదైపోయింది ఆ సినిమా. అయినప్పటికీ మంచు విష్ణుకు అదే ఎప్పటికీ నిత్యనూతనమే. దానికి కారణం అతడి కెరీర్ లో అప్పటికీ ఇప్పటికీ బిగ్గెస్ట్ హిట్ అదే కాబట్టి. అందుకే ఈ హీరో ఇప్పుడా సినిమాను మరోసారి ప్రస్తావించాడు.

ఢీ సినిమా దర్శకుడు శ్రీనువైట్ల తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మంచు విష్ణు.. ఢీ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.

మంచు విష్ణుకు సక్సెస్ వచ్చి చాలా ఏళ్లయింది. నిజానికి అతడు సినిమాలు కూడా తగ్గించేశాడు. ఇటు శ్రీనువైట్ల వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో.. విష్ణుతో ఢీ-2 ప్లాన్ చేస్తున్నాడు వైట్ల. అదే విషయాన్ని విష్ణు నిన్న పరోక్షంగా వెల్లడించాడు. కనీసం ఈ సీక్వెల్ తోనైనా ఈ దర్శకుడు, ఆ హీరో హిట్ బాట పడతారో చూడాలి.