మాజీ ఏజీ దమ్మాలపాటిపై మరో కేసు నమోదు

మాజీ అడ్వకేట్ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై మరో కేసు నమోదు అయింది. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఒక రిటైర్డ్ లెక్చరర్ ఇచ్చిన ఫిర్యాదు  మేరకు దమ్మాలపాటితో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేశారు.

సీఆర్‌డీఏ పరిధిలోని కృష్ణాయపాలెంలో లేక్‌వ్యూ పేరుతో దమ్మాలపాటి కుటుంబం అపార్ట్‌మెంట్స్‌ నిర్మిస్తున్నారని… తన వద్ద రెండు ఫ్లాట్లకు డబ్బులు తీసుకుని ఒక ఫ్లాట్‌ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారని రిటైర్డ్ లెక్చరర్ రాజారామమోహన్‌ రావు చెబుతున్నారు.

75 లక్షలు తీసుకున్నారని వెల్లడించారు. ఒక ఫ్లాట్‌ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించారని… డబ్బు అయినా ఇవ్వాలని కోరగా … తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరించారని రిటైర్డ్ లెక్చరర్ రాజారామమోహన్ రావు ఫిర్యాదు చేశారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు  మంగళగిరి పోలీసులు… మోసం, నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతుకం వంటి నేరాల కింద దమ్మాలపాటి, ఆయన కుటుంబసభ్యులపై కేసు ఫైల్ చేశారు.