ముగిసిన హీరోయిన్ల డ్రగ్స్ విచారణ

ముంబయిలోని ఎన్సీబీ ఆఫీసు ఈరోజు హీరోయిన్లతో కళకళలాడింది. ఒకేసారి ముగ్గురు హీరోయిన్లను విచారించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది.

ఉదయం 9గంటల 30 నిమిషాలకు ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది దీపిక పదుకోణ్. ఆమెను 5 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. ఈ విచారణలో పలు కీలక విషయాల్ని దీపిక వెల్లడించినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా తన మేనేజర్ కరిష్మాతో 2017లో జరిపిన వాట్సాప్ ఛాటింగ్స్ తనవేనని దీపిక అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే డ్రగ్స్ మాత్రం ఎప్పుడూ తీసుకోలేదని తెలిపిందట.

దాదాపు ఇవే రకమైన ప్రశ్నల్మి మిగతా ఇద్దరు హీరోయిన్లు శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్ ఎదుర్కొన్నారు. సుశాంత్ తో తాము పార్టీలకు హాజరైన విషయాన్ని వీళ్లు అంగీకరించారు. అయితే అక్కడ మాదకద్రవ్యాలు సేవించలేదని వీళ్లు అధికారులకు తెలియజేశారు.

ప్రస్తుతానికి వీళ్ల ముగ్గుర్ని ఇంటికి పంపించిన అధికారులు.. మరోసారి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్లలో దీపిక చెప్పిన సమాధానాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయలేదంటూ జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.