దిశను కళ్లకుకట్టిన రామ్ గోపాల్ వర్మ….

వార్తల్లో నలిగిన సబ్జెక్టులకు దృశ్యరూపం ఇవ్వడంలో రామ్ గోపాల్ వర్మ దిట్ట. నిజజీవితంలో జరిగిన ఘటనలను తనదైన శైలిలో తెరపై చూపిస్తుంటాడు ఈ దర్శకుడు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కదిలించిన దిశ ఘటనపై కూడా సినిమా తీశాడు వర్మ. ఆ సినిమా ట్రయిలర్ ను ఈరోజు రిలీజ్ చేశాడు.

దిశ ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ అమ్మాయిని, నలుగురు దుండగులు ఎత్తుకెళ్లి, అత్యాచారం చేసి, రింగ్ రోడ్డు బ్రిడ్జి కింద ఆమెను కాల్చేశారు. దేశాన్ని కదిలించిన ఈ ఘటనలో నిందితులు నలుగుర్ని పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. అలా దిశ కేసుకు తక్షణ ముగింపు ఇవ్వగలిగారు.

ఇప్పుడీ మొత్తం వ్యవహారానికి దృశ్యరూపం ఇచ్చాడు వర్మ. రియల్ లొకేషన్ లో వర్మ ఈ సినిమా తీశాడనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. ఎలాంటి సస్పెన్స్ లేకుండా కీలకమైన అంశాలన్నింటినీ తన ట్రయిలర్ లో చూపించాడు వర్మ. ఎన్ కౌంటర్ పై మాత్రం సస్పెన్స్ ఉంచాడు. నవంబర్ 26కు దిశ ఘటన జరిగి సరిగ్గా ఏడాది అవుతుంది. ఆ రోజున సినిమాను రిలీజ్ చేస్తామని వర్మ ప్రకటించాడు.