జగన్‌ సీఎంగా విధులు నిర్వహించకుండా అడ్డుకోండి – హైకోర్టులో పిటిషన్‌

ఏపీ హైకోర్టులో మరో ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ముఖ్యమంత్రిగా జగన్‌ ఏ అధికారంతో పనిచేస్తున్నారో వివరణ కోరండి అంటూ హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేశాడు. సీఎంగా జగన్‌ విధులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాడు.

గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురానికి చెందిన ఆలోకం సుధాకర్‌ బాబు అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

తిరుమల వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదని… అలా చేసి దేవాదాయ చట్టంలోని పలు సెక్షన్లను ఉల్లంఘించారంటూ పిటిషన్ వేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన ముఖ్యమంత్రి ఏ అధికారంతో ఆ పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ హైకోర్టులో కో వారంటో పిటిషన్ వేశారు.

ముఖ్యమంత్రితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, టీటీడీ ఈవో అనిల్ సింఘాల్‌ నుంచి కూడా వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవోలు వారివారి బాధ్యతలు నిర్వహించకుండా నిలువరించాలని పిటిషనర్‌ హైకోర్టును కోరారు.