Telugu Global
Health & Life Style

కరోనా తగ్గాక కూడా.... కలవరపెడుతున్న ఆరోగ్యం

కరోనా వైరస్ మానవ శరీరంలో 14రోజులపాటే బతికి ఉండొచ్చు. పారాసెట్మాల్ ట్రీట్ మెంట్ తోటే తగ్గిపోవచ్చు. ఆస్పత్రి మొహం చూడకుండా హోం ఐసోలేషన్ తోనే చాలామంది కోలుకుని ఉండొచ్చు. కానీ.. కరోనా తర్వాత జీవితం ఎలా ఉంటుందనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇటీవల చనిపోయిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనానుంచి కోలుకున్న తర్వాతే తీవ్ర అనారోగ్యం ఆయన్ను చుట్టుముట్టింది. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్ వల్ల, దాని ద్వారా వచ్చిన ఇతర జబ్బుల కారణంగానే […]

కరోనా తగ్గాక కూడా.... కలవరపెడుతున్న ఆరోగ్యం
X

కరోనా వైరస్ మానవ శరీరంలో 14రోజులపాటే బతికి ఉండొచ్చు. పారాసెట్మాల్ ట్రీట్ మెంట్ తోటే తగ్గిపోవచ్చు. ఆస్పత్రి మొహం చూడకుండా హోం ఐసోలేషన్ తోనే చాలామంది కోలుకుని ఉండొచ్చు. కానీ.. కరోనా తర్వాత జీవితం ఎలా ఉంటుందనే విషయంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.

ఇటీవల చనిపోయిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనానుంచి కోలుకున్న తర్వాతే తీవ్ర అనారోగ్యం ఆయన్ను చుట్టుముట్టింది. పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్ వల్ల, దాని ద్వారా వచ్చిన ఇతర జబ్బుల కారణంగానే ఎస్పీబీ మరణించారు.

ఒక్క బాలునే కాదు.. చాలా వరకు కరోనా మరణాల్లో పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆస్పత్రికి కొంతమంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు వచ్చారు. త్వరగా అలసి పోవడం, చిన్న చిన్నపనులకే ఆయాసం రావడం, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు.. ఇవీ వారిలో ఉన్న కామన్ లక్షణాలు. అన్నిటికంటే ముఖ్యమైన మరో కామన్ పాయింట్ వారంతా కరోనానుంచి కోలుకున్నవారు కావడం.

కరోనానుంచి బైటపడిన తర్వాత వారంతా ఇతర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. కరోనాకి ముందు సునాయాసంగా 30నిముషాల పాటు వ్యాయామం చేసేవాళ్లమని, కొవిడ్ నుంచి కోలుకున్నాక 2 నిముషాలు నడిస్తేనే తీవ్ర అలసట వస్తోందని అంటున్నారు.

కరోనా నుంచి కోలుకున్న వారిలో…. జ్ఞాపక శక్తి కోల్పోవడం, త్వరగా నీరసించి పోవడం, దేనిమీదా దృష్టి కేంద్రీకరించలేకపోవడం, నిద్రలేమి.. లాంటి సమస్యలు రీ ఇన్ఫెక్షన్ దశలో వస్తున్నాయి. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాటల ప్రకారం ప్రస్తుతం వారి టీమ్ అంతా ఈ రీ ఇన్ఫెక్షన్ పైనే ఫోకస్ పెడుతోంది.

కరోనా నయమైన తర్వాత ఆరు నెలల వరకు పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని, ఆరు నుంచి 9 నెలల వరకు పోస్ట్ కొవిడ్ కాంప్లికేషన్స్ ఇబ్బంది పెడతాయని గులేరియా చెబుతున్నారు. కొన్నిసార్లు ఇవి జీవితాంతం వెంటాడతాయని అంటున్నారు. వీటి వల్లే కొవిడ్ వ్యాక్సిన్ కనుక్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

హాంకాంగ్, బెల్జియం, యూకే, ఇండియాలో రీ ఇన్ఫెక్షన్.. ఎక్కువగా ఉందని పుణెలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణులు చెబుతున్నారు.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 60లక్షలకు చేరుకుంటోంది. దాదాపు 49లక్షలమంది వ్యాధి నయమై ఇంటికి వెళ్లిపోయారు. వీరిలో అతికొద్దిమంది మాత్రమే నూటికి నూరుశాతం ఆరోగ్యంతో ఉన్నారని తెలుస్తోంది. మిగతావారందరిలో చిన్నచిన్న సమస్యలు తలెత్తుతున్నాయి.

యాంటీబాడీలు సరిగా డెవలప్ కాకపోవడం, ఒకవేళ డెవలప్ అయినా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం.. ఇలా రకరకాల కారణాలవల్ల కరోనా తర్వతా చాలామందిలో సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా నయమైన తర్వాత కూడా మరణాల సంఖ్య అధికంగానే ఉంటోందని, అయితే ఇవన్నీ కరోనా మరణాల లెక్కలోకి రావట్లేదని, ఊపిరితిత్తుల సమస్యల వల్ల, గుండె సమస్యల వల్ల, కిడ్నీ, లివర్ సమస్యల వల్ల వారంతా చనిపోతున్నారని డాక్టర్లు డెత్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని అసోం ఆరోగ్య సాఖ కార్యదర్శి చెబుతున్నారు.

పోస్ట్ కొవిడ్ క్లినిక్స్..

ప్రస్తుతం ఢిల్లీ సహా ఇతర ప్రాంతాల్లో పోస్ట్ కొవిడ్ క్లినిక్స్ ఎక్కువవుతున్నాయి. కరోనా తగ్గిపోయిన తర్వాత ఇతర సమస్యలు తలెత్తిన వారికి ప్రత్యేకంగా ఇక్క వైద్య సహాయం అందుతోంది. టెలి మెడిసిన్ పద్ధతిలో కూడా పోస్ట్ కొవిడ్ క్లినిక్స్ లో వైద్య సహాయం చేస్తున్నారు.

కరోనా వైరస్ వచ్చి కోలుకున్న తర్వాత కూడా చాలమందిని పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఇబ్బంది పెడుతున్నాయి. కరోనా తగ్గిపోయిందని సంబరపడేలోపే.. వాటి ద్వారా వచ్చే ఇతర సమస్యలు తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నాయి.

First Published:  27 Sep 2020 6:00 AM GMT
Next Story