గోపీచంద్ సినిమాకు 7 కోట్లు ఆఫర్

గోపీచంద్ నటించి ఆగిపోయిన సినిమా ఒకటుంది. దాని పేరు ఆరడుగుల బుల్లెట్. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర పోషించాడు. మూవీ రిచ్ గానే తీశారు. కానీ ఆర్థిక సమస్యల్లో పడడం, కోర్టు కేసుల వల్ల ఏకంగా ఆగిపోయింది. అలా ల్యాబ్ కే పరిమితమైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది.

జీ5 సంస్థ ఆరుడుగుల బుల్లెట్ సినిమా రైట్స్ దక్కించుకుంది. ఏకంగా 7 కోట్ల రూపాయలు పెట్టి ఈ సినిమాను సంస్థ దక్కించుకున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు నిర్మాత రమేష్ తో జీ5 డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ మూవీని దీపావళి టైమ్ లో స్ట్రీమింగ్ కు పెట్టాలని సదరు సంస్థ భావిస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఒక అనుమానం మాత్రం అందర్నీ వేధిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వారం రోజుల షెడ్యూల్ బాకీ ఉంది. అది కూడా పాటలు కాదు, టాకీ. పైగా ప్రకాష్ రాజ్ లాంటి నటులు కొంతమంది డబ్బింగ్ ఇంకా పూర్తిగా చెప్పలేదు. మరి అవన్నీ ఎలా మేనేజ్ చేశారనేది పెద్ద ప్రశ్న.