మీడియా యుద్ధం ఇంకెన్నాళ్లు.. ?

మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబు చాణక్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వ్యవస్థల మేనేజ్ మెంట్ లో కూడా ఆయన దిట్ట. వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన ఇంకా ఆ రెండు విషయాల్లో చక్రం తిప్పుతున్నారంటే పరిస్థితిని ఎంతలా కంట్రోల్ లో పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అయితే రాజకీయాలు ప్రజాభిమానంతో కూడుకున్నవి. వ్యవస్థలను మేనేజ్ చేసినంత మాత్రాన, మీడియా మన పక్షాన నిలబడ్డంత మాత్రాన పనులు కావు. ఈ రెండూ ఉన్నా కూడా గత ఎన్నికల్లో చంద్రబాబుకి ఘోర పరాభవం దక్కింది. అయితే దాని నుంచి మాత్రం ఆయన ఇంకా గుణపాఠాలు నేర్చుకున్నట్టు లేరు.

ఒక్క ఛాన్స్ అడిగారు, జగన్ సీఎం అయ్యారు అని విమర్శిస్తున్నారే కానీ, టీడీపీపై ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత పెరిగింది, జగన్ కి అంత ఘన విజయం ఎలా దక్కింది అనే విషయాన్ని ఏడాదిన్నరగా ఎప్పుడూ తర్కించుకోలేకపోయారు. పైపెచ్చు మీడియా వందిమాగధులు.. జయము జయము చంద్రన్నా.. అంటూ ఆయన్ని ఆలోచించుకోనీకుండా చేస్తున్నారు. ఒక్కో సమయంలో ఈ అతి విధేయత కూడా చంద్రబాబుకి చెరుపు చేసేదే.

అంతర్వేది అంశమయినా, తిరుమల డిక్లరేషన్ వ్యవహారం అయినా.. బాబు అనుకూల మీడియా హైలెట్ చేసింది కాబట్టి.. వాటికి అంత ఫోకస్ వచ్చింది. పోనీ.. ఆ రెండు విషయాలతో టీడీపీ ఏం సాధించినట్టు? ఎంతమందిలో ఆలోచన రేకెత్తించినట్టు? ఒక్క ఓటరు మనసైనా మారిందా? లేనిపోని ఆరోపణలు చేసి తిరుమల విషయంలో జగన్ ని మరోసారి హీరోని చేశారు.

తిరుమలలో జగన్ పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఎప్పుడూ లేనంతగా హైలైట్ అయింది. దీనికి కారణం టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా. ఇక అమరావతి ఉద్యమం కూడా ఇన్నాళ్లు జనంలో నానుతోంది అంటే.. దానికి కారణం కూడా మీడియానే. లేని సమస్యలను సృష్టించడం, వాటిని హైలైట్ చేయడం, ప్రభుత్వంపై బురదజల్లడం.. ఇవన్నీ మీడియాతో సాధించొచ్చు కానీ, ప్రజల మనసులు గెలుచుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయినా సరే ఇంకా మీడియానే పట్టుకుని వేళ్లాడుతున్నారు చంద్రబాబు అండ్ కో.

ఎన్నికల తర్వాత ఇప్పటి వరకూ టీడీపీ నాయకులు ప్రజా క్షేత్రంలోకి రాలేదు, అసలైన ప్రజా సమస్యలపై కనీసం దృష్టిపెట్టలేదు. ప్రజా వేదిక కూల్చివేశారు, మా మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులేసుకుంటున్నారంటూ.. లేనిపోని విషయాలను నెత్తికి ఎత్తుకుని అభాసుపాలవుతున్నారు టీడీపీ నాయకులు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు.

స్థానిక టీడీపీ నాయకులు జనాల్లోకి వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. భావి నాయకుడు సోషల్ మీడియా వదిలి బైటకు రానంటున్నారు. ఈ దశలో చంద్రబాబు ఇంకా మీడియాని అడ్డం పెట్టుకుని వైసీపీని దెబ్బకొట్టాలని చూడటం గడ్డిపోచ ఊతంతో ఏరు దాటాలని చేస్తున్న ప్రయత్నమే.