మీరు జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో స్పష్టమైంది…

వైసీపీ ప్రభుత్వానికి కోర్టుల్లో వరుసగా చీవాట్లు పడుతున్నాయని… వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారని అందులో అనుమానం లేదంటూ   బీజీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన పురందేశ్వరి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు.

అమరావతిలోనే రాజధాని ఉండాలని కూడా ఆమె ఈనాడుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనపై ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని… హైకోర్టు నుంచి పదేపదే ప్రభుత్వం చీవాట్లు ఎదుర్కొంటోందని విమర్శించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పురందేశ్వరి వ్యాఖ్యలపై మరింత తీవ్రంగా స్పందించారు. పురందేశ్వరి ఈరోజు ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో, అందులో రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైంది అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శించారు.

పురందేశ్వరి బీజేపీలో ఉన్నప్పటికీ ఆమె భర్త, కుమారుడు మాత్రం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే ఆయన గెలవలేకపోయారు.