Telugu Global
National

బీజేపీతో కలయిక చంద్రబాబు కలేనా..?

చంద్రబాబుకి ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా లేదు. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ ఎప్పుడు గెలిచినా.. ఏదో ఒక పార్టీ సపోర్ట్ కచ్చితంగా ఉండేది. వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీ, జనసేన.. ఆఖరికి గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్న ఘన చరిత్ర బాబుది. 2014 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని అంటుంటారు. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా […]

బీజేపీతో కలయిక చంద్రబాబు కలేనా..?
X

చంద్రబాబుకి ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా లేదు. గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ ఎప్పుడు గెలిచినా.. ఏదో ఒక పార్టీ సపోర్ట్ కచ్చితంగా ఉండేది. వామపక్షాలు, టీఆర్ఎస్, బీజేపీ, జనసేన.. ఆఖరికి గత తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకున్న ఘన చరిత్ర బాబుది.

2014 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేన సపోర్ట్ లేకపోతే చంద్రబాబు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని అంటుంటారు. అధికార పార్టీ అయ్యుండి కూడా.. 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగి 175 సీట్లకు కేవలం 23 సీట్లకి పరిమితం అయిందంటే.. ఒంటరిగా టీడీపీకి ఉన్న బలం ఏపాటిదో అర్థమవుతుంది.

ఇక 2024 ఎన్నికలనాటికి ఎలాగైనా మిత్రపక్షాల మద్దతుతోనే బరిలో దిగాలనేది బాబు దూరాలోచన. ఇప్పటికే వామపక్షాలను దువ్వుతున్నారు, అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంటారు, పవన్ కల్యాణ్ ని పల్లెత్తుమాట అనరు.

ఇలా.. వైసీపీని ఏకాకిని చేయాలనేది బాబు ప్లాన్. అయితే ఈసారెందుకో బీజేపీ వ్యవహారంతో బాబు వ్యూహాలు ఫలించేటట్లు కనపడ్డంలేదు. ఏపీ బీజేపీ అధ్యక్ష స్థానంలో జరిగిన మార్పుతో ఈ విషయం స్పష్టమైంది. బాబు చేతిలో మనిషిగా పనిచేస్తున్న కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టి, సోము వీర్రాజుని తీసుకొచ్చి పెట్టడంతో బాబు కాస్త ఇబ్బంది పడ్డారు.

దెబ్బమీద దెబ్బలాగా.. దగ్గుబాటి పురందీశ్వరికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది అధిష్టానం. నారా, దగ్గుబాటి ఫ్యామిలీలు ఉప్పు నిప్పులా ఉంటాయి. చంద్రబాబుని దూరం పెట్టిన చాలామంది.. ఆ తర్వాతి కాలంలో ఆయనకు దగ్గరయ్యారు కానీ, ఒక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం బాబుని ఆగర్భ శత్రువులా చూస్తారు. అసలు చంద్రబాబు అంటేనే ఆయనకి పడదు, ఆటోమేటిగ్గా ఆయన భార్య పురందీశ్వరి కూడా అవకాశం దొరికినప్పుడల్లా బావ చంద్రబాబుపై విరుచుకుపడుతుంటారు.

అలాంటి పురందీశ్వరి ఇప్పుడు జాతీయ పదవిలో ఉన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవాలంటే.. కచ్చితంగా ఆ చర్చల్లో రాష్ట్ర నేతలకు పార్టీ ప్రాధాన్యమిస్తుంది. మరి పురందీశ్వరి టీడీపీని దగ్గరకు రానిస్తారా, బాబుతో పొత్తు పెట్టుకోవడానికి ఆమె సుముఖంగా ఉంటారా? అనేది అనుమానమే.

అసలు చంద్రబాబుని దూరం పెట్టడానికే బీజేపీ అధిష్టానం పురందీశ్వరికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టిందనే ప్రచారం కూడా ఉంది. ఎన్నికల టైమ్ కి ఎలాగోలా బీజేపీకి దగ్గరవుతామనుకుంటున్న చంద్రబాబు కోరిక ఇక కలేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

బీజేపీ అండలేకపోతే, పవన్ కూడా చేతికి చిక్కరు. ఈ రెండు పార్టీల తోడు లేకపోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఏకాకిగానే మిగులుతారు. అలా పోటీ చేస్తే.. 2019లో టీడీపీ ఓట్లను బీజేపీ, జనసేన కూటమి భారీగా చీలుస్తుందని అంటున్నారు. తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించి చివరకు బాబు ఎలాగైనా బీజేపీ పంచన చేరగలడని మరికొందరి అభిప్రాయం.

ఏది ఏమైనా.. పురందీశ్వరి ఎంట్రీతో బాబు బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయనేది మాత్రం వాస్తవం.

First Published:  29 Sep 2020 7:00 AM GMT
Next Story